కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి?

కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి?

మన పూర్వీకులు మనకేర్పరచిన ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం దాగి ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం… ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం లో వేప పువ్వు రూపంలో, కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరికాయ రూపంలోనూ, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలోనూ అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదని మన పెద్దలు చెబుతారు.

2. ఎలా చేయాలి?

కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల నదిలో నిలబడి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసి మూడుసార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఔషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయం అవుతాయి. అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసుప్రశాంతతను సంతరించుకుంటుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానం వెనుక మరో కారణం కూడా దాగి ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదులల్లో అపారమైన అయస్కాంత శక్తి ఉంటుంది. అందువల్ల కార్తీక మాసంలో నదీ స్నానం చేయమని మన పెద్దలు అంటారు.

Share.