“సైరా నరసిహారెడ్డి “రివ్యూ

114

‘మెగాస్టార్’ అనే పదం వినబడితే చాలు తెలుగు బాక్సాఫీస్ పులకరిస్తుంది,పండగ చేసుకుంటుంది. బాస్ వస్తున్నాడు.. పాత రికార్డ్స్ చెరిగిపోతాయి.. కొత్త రికార్డ్స్ వచ్చి చేరతాయి.. అన్న ధీమా కనిపిస్తుంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ‘మెగా ప్రభంజనం’ ముంచెత్తుతుంది. ఇదంతా చిరంజీవి ఒక మామూలు సినిమాతో వస్తే జరిగే పరిణామాలు.. అలాంటిది తన కోసమే పురుడు పోసుకున్న పాత్రలో మెగాస్టార్ కనిపిస్తే, మెగా రాజసానికి తోడుగా ఇండియా లెవెల్లో బెస్ట్ అనిపించుకున్న తారాగణం కూడా ఒకే సినిమాలో కనిపిస్తే, అడుగడుగునా గ్రాండియర్‌తో ‌సినిమా నిండిపోతే, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించే కథలో అసమాన నట వైభవం తొణికిసలాడుతుంటే అప్పుడు ఆ సినిమా రేంజ్ ఏంటి? ఆ సినిమా స్పాన్ ఏంటి? ఆ సినిమా ముందు మోకరిల్లని రికార్డులు ఏంటి? ఇక మెగాస్టార్ మైల్ స్టోన్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దేశం మొత్తం అదే మోత.. ఎక్కడ విన్నా కూడా సైరా విశేషాలే.. వాటన్నిటిని అంచనాలు అనే చిన్నమాటతో తీసెయ్యలేము. అదీ రికార్డుల రారాజు మెగాస్టార్ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా నిర్మాణం మొదలయ్యింది. ఆ నమ్మకంతోనే  ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సారి ‘సైరా’ అంటూ వచ్చిన మెగాస్టార్ నరసింహారెడ్డిగా ఎలా చెలరేగాడు, అందరి చేత జేజేలు కొట్టించుకున్నాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే : రేనాటి ప్రాంతంలో 61 ప్రాంతాలను పాలెగాళ్లు పరిపాలిస్తుంటారు. బ్రిటీష్ వారి అన్యాయాలకు వారి దౌర్జన్యాలకు ఎదురు తిరగలేక చాలా మంది పాలెగాళ్లు.. బ్రిటీష్ వాళ్లకు లొంగిపోతారు. పంట పండకపోయినా.. ఎంత కరువున్నా.. ప్రభుత్వానికి మాత్రం సిస్తు కట్టాల్సిందే అని బ్రిటీష్ పాలకులు హుకుం జారీ చేస్తారు.. అలాంటి సమయంలో బ్రిటీష్ వారి ఆగడాలకు ఎదురు తిరిగి ప్రజలకు బాసటగా నిలుస్తాడు ఉయ్యాలవాడ పాలెగాడు నరసింహారెడ్డి. మా పంట మీద మా భూమి మీద మీ పెత్తనం ఏంటీ అంటూ.. బ్రిటీష్ పాలకులపై యుద్దం ప్రకటిస్తాడు. కానీ తనకంటూ సైన్యం లేకపోవడం.. పాలెగాళ్లలో సఖ్యత లేకపోవడంతో.. సైరానరసిహారెడ్డి పాలెగాళ్ళు అందరినీ ఏకం చేసి బ్రిటీష్ వాళ్లపై పోరాడే సమయంలో నరసిహారెడ్డి ఎలాంటి వ్యూహాలను రచించాడు.. ఈ పోరులో ఆయనకు తోడుగా నిలిచింది ఎవరు..? నరసింహారెడ్డి పోరాటం ఎవరికి స్పూర్తిగా నిలిచింది అనేది సినిమా కథ.. 

నటీనటులు గురించి చూస్తే :  సైరా ఎవరి నటనకి కూడా వంకపెట్టడానికి లేదు. అంతా కూడా ఇప్పటికీ తాము ఎంత గొప్పనటులమో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారా లేదా అనేది మాత్రమే చూడగలం. చిరంజీవి ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు, ఈ సినిమాలో చేసిన పాత్ర ఒక ఎత్తు. ఆనాటి పోరాటయోధుడి కథను ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టాడు. రేనాటి స్వాతంత్ర్య సమరయోధుడికి మళ్ళీ వెండితెర సాక్షిగా ప్రాణం పోశాడు. చిరంజీవిని మెగాస్టార్ అని ఎందుకు అంటారో ఎవరికయినా అనుమానం ఉంటే వాళ్ళు ఈ సినిమాలో చిరంజీవి నటన చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నరనరాన నరసింహారెడ్డిని ఆవహింపజేసుకుని తెరపై తిరుగాడాడు చిరంజీవి. ఇక అమితాబ్ కూడా చిరంజీవికి గురువుగా హుందాగా నటించి ఆ పాత్రకు మంచి వెయిట్ తీసుకువచ్చారు. నయనతార, తమన్నాలకు కూడా కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి అంతా కూడా అదుర్స్ అనిపించేసారు. ఓవరా‌ల్‌గా సైరాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాకు ప్లస్ అయ్యారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే : స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి చిరంజీవి స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవడమే కాకుండా… సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అభిమానులు చిరంజీవి నుండి ఏం ఆశిస్తారో.. అవన్నీ ఉండేట్టు.. తెరకెక్కించాడు. ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాడు. సురేందర్ రెడ్డి కష్టం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.  చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ తనను నమ్మిన దానికి 100 పర్సంట్ ఎఫెర్ట్ పెట్టి.. చారిత్రక కథను సినిమాగా అద్భుతంగా మలచడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. ఇక కెమెరా‌మెన్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం పొసింది అనే చెప్పాలి.. దర్శకుడు విజన్‌ను తన ఫ్రేమ్స్‌తో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చి దిద్దాడు.. అమిత్ త్రివేది అందించిన సంగీతం.. సినిమాకు పిల్లర్‌గా నిలిచి ఆకట్టుకుంది. జూలియస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. ప్రతీ సన్నీవేశాన్ని కూడా ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. ఇక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ గ్రెక్ పావెల్.. రామ్ లక్ష్మణ్‌లు అందించిన పోరాట ఘట్టాలు.. ప్రేక్షకులను ఓరేంజ్‌లో అబ్బుర పరుస్తాయి.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్.. బాగున్నాయి.. అయితే ఇంకాస్త పదును ఉంటే బాగుండు అనిపించింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలసింది చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించే.. తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వడం కోసం మెగాస్టార్ కలల ప్రాజెక్ట్‌ను టేకప్ చేసి ఖర్చుకు వెనకాడకుండా దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించి… ఆకథకు తగిన గ్రాండియర్ లుక్‌ను తేవడంలో ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా సినిమాను నిర్మించాడు రామ్ చరణ్.

ఓవరాల్‌గా చెప్పాలి అంటే.. తొలితరం స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసిహా రెడ్డి జీవిత చరిత్రను భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడంలో కొణిదెల ప్రొడక్షన్ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. మెగా అభిమానులే కాకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరించే ఎమోషనల్ విజువల్ ట్రీట్ మూవీ సైరా నరసింహారెడ్డి.. 


ప్లస్ పాయింట్స్ :
మెగాస్టార్ చిరంజీవి 
ప్రొడక్షన్ వాల్యూస్ 
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ
కథ, కథనం 
బ్యాగ్రౌండ్ స్కోర్ 


మైనస్ పాయింట్స్ :
స్థాయికి తగని కొన్ని సన్నివేశాలు 
పరిధిని మించిన కల్పన 
పదును తగ్గిన సంభాషణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here