మౌలాలిలో అంత్యక్రియలు, ఫిల్మ్ ఛాంబర్ కు భౌతికకాయం

వేణు మాధవ్ ఈ పేరు వినగానే తెలుగు సినిమాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు బాలు..నల్లబాలు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ, సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 25, బుధవారం మధ్యాహ్నం 12.21 నిమిషాలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు గురువారం మౌలాలి లోని ఆయన ఎస్టేట్ లోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ ప్రముఖుల సందర్శనార్ధం వేణుమాధవ్ భౌతిక కాయాన్ని గురువారం సెప్టెంబర్26 మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు.

వేణుమాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేణుమాధవ్‌ చేసిన వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ చూసి భువనగిరిలో జరుగుతున్న టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాడులో ఆయన ప్రదర్శన ఇచ్చారు. అది ఎన్టీఆర్‌కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్‌కు మొదట హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులోఉద్యోగం ఇచ్చారు. అనంతరం టీడీఎల్పీ ఆఫీసులోనూ, నాచారం ఆశ్రమంలోనూ, ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లోనూ వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 600 పైగా చిత్రాల్లో నటించారు.

‘గోకులంలో సీత’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘యువరాజు’ వంటి సినిమాలతో టాలీవుడ్‌‌లో టాప్ కమెడియన్‌‌గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితోనూ నటించారు. ‘వెంకీ’, ‘దిల్’, ‘లక్ష్మీ’, సై, ‘ఛత్రపతి’, ‘జై చిరంజీవ’, ‘పోకిరి’, ‘కృష్ణ’, ‘సింహా’, ‘బృందావనం’, ‘కిక్’, ‘రచ్చ’ వంటి పలు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వేణు మాధవ్. ‘నల్లబాలు నల్లతాచు లెక్క’, ‘సనత్ నగర్ సత్తి’, ‘టైగర్ సత్తి’.. ఇలా ఎన్నో క్యారెక్టర్స్‌ని తన స్టైల్ కామెడీతో పండించారాయన. ‘హంగామా’, ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ సినిమాల్లో హీరోగా నటించారు. ప్రేమాభిషేకం చిత్రంతో నిర్మాతగా మారారు. మిమిక్రీ కళాకారుడిగా, బుల్లితెర వాఖ్యాతగా, హాస్యనటుడిగా, హీరోగా,నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో పలు విభిన్నమైన పాత్రలు పోషించిన వేణు మాధవ్..భౌతికంగా మన మధ్య లేకపోయినా తను పోషించిన పలు పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉంటారు.

Share.