వివాదాల చుట్టూ గ్యాంగ్ లీడర్

వివాదాలకు దూరంగా ఉండే నేచురల్ స్టార్ నానీ కొత్త సినిమా టైటిల్ విషయంలో మాత్రం వివాదం మూటగట్టుకుంటున్నారు. యేటివ్‌ డైరెక్టర్ విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో నానీ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా.. ఆ సినిమా టైటిల్ పలు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు “గ్యాంగ్ లీడర్” అనే టైటిల్ ను పెట్టడంతో మెగా అభిమానులు నానీపైన దర్శకుడు విక్రమ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమా ఆయన అభిమానులకు సెంటిమెంట్ గా ఉంది. అయితే ఈ టైటిల్ ను నానీ తన సినిమాకు వాడుకోవడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సెంటిమెంట్లతో ఆడుకోవద్దిని టైటిల్ ని వెంటనే మార్చాలంటూ అభిమానులు ట్విట్టర్ లో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్‌ నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేకించగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీమసుకున్నారు.
ఇదిలా ఉంటే తనే హీరోగా, నిర్మాతగా గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు శింగులూరి మోహన్ కృష్ణ అనే నిర్మాత చెబుతున్నారు. మూడు కోట్ల బడ్జెట్ తో సినిమా తీయబోతున్నానని, ఏప్రిల్ 6వ తేదీ నుండి సినిమాను నిర్మించాలని భావిస్తున్నానని ఇదే సమయంలో నానీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు అదే పేరును పెట్టడం కరక్ట్కాదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22వ తేదీన సినిమాను విడుదల చేయాలని కూడా అనుకున్నట్లు తెలిపాడు. తనను సంప్రదించకుండా టైటిల్ పెట్టుకుని, పేపర్ కు న్యూస్ ఇచ్చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించారని, చాంబర్ వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని, చిన్న సినిమాకు ఒకలా పెద్ద సినిమాకు ఒకలా వాళ్లు వ్యవహరిస్తున్నారంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

Share.