సినిమా నిర్మాతలు, దర్శకులు కు రాయలసీమ వాళ్ళ తుది హెచ్చరిక

మేము సీడెడ్ కాదు… రాయలసీమ వాళ్ళం.

ఇదే..మా తుది హెచ్చరిక……!

నైజాం నవాబులు సైనిక భరణం కింద రాయలసీమ అని ప్రస్తుతం పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని 1799 లో బ్రటిష్ వాళ్ళకు విడిచి పెట్టారు. విడిచేసిన ఈ ప్రాంతాన్ని 1800 నాడు బ్రిటీష్ వారు ఆధీనంలో తీసుకొన్నారు. ఇంగ్లీషులో సీడెడ్ డిస్ట్రిక్ట్స్ గా వారు వ్యవహరించారు. తెలుగులో ఆ పదానికి అర్థం విడిచిన, వదిలివేసిన మండలాలు అని అర్థం. సీడెడ్ అంటే అవమానంగ ఉంటాదని ఎవరో పుణ్యాత్ములు తెలుగులో “దత్తమండలాలు” అని అనువాదంగా వ్యవహరిస్తు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అప్పుకు ఈ ప్రాంతాన్ని జమ చేసుకొన్నారే గాని ఏనాడు వాళ్ళు దత్తత తీసుకొలేదు.ఎదో మర్యాదకోసమే ఆ పదం అలాగే కొసాగింది.

ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. మహారాష్ట్రుల నుండి నిజాం తన భూబాగం కాపాడుకోవడానికి బ్రిటిష్ వారి సైన్యాల ఖర్చుకు గాను రాయలసీమ ప్రాంతాన్ని ఇలా ధారాదత్తం చేసాడు. అప్పటికే సీమ పాలెగాళ్ళ నుండి పెద్దెత్తున కప్పాలు వసూలుచేసాడు. అంటే అప్పటి నైజాం ప్రాంతం రక్షణకోసం సీమ ప్రాంతం బలైపోయింది. హైదరాబాదు అభివృద్ధి లో ఈ సీమ వాసుల కప్పాల ద్వారా కట్టిన భాగస్వామ్యం మరువరాదు. రాయలసీమ ప్రాంత సమస్యల పట్ల తెలంగాణ సమాజం ఎప్పటికీ తమవంతు చేదోడు, వాదోడు గా నిలవాలి.

1928 దాకా సీడెడ్ గానో దత్తమండలాలు గానో పిలవబడిన ఈ ప్రాంతం1928 నవంబర్ 18 న నంద్యాలలోఆంధ్రమహాసభలలో భాగంగా జరిగిన “ప్రథమ దత్తమండలాల సభ”లో చిలుకూరు నారాయణరావు గారి సూచనతో “రాయలసీమ” గా ఈ ప్రాంతానికి నామకరణం చేసారు. సీమ ఆత్మగౌరవానికి ప్రతీక ఈ పరిణామం. చిలుకూరు వారు కళింగ ప్రాంతమైనప్పటికీ, అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేసేవారు. ఎంతో చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యంతో వెలిగిన ఈ ప్రాంతాన్ని దత్త అనడం సబబు కాదని “దత్త” అనే గేయం రాసి ప్రజలను అప్పటికే చైతన్యం చేసాడు. చివరగా నంద్యాలలో రాయలసీమ అని ఈ ప్రాంతానికి ప్రతిపాదించాడు. పప్పూరు రామాచార్యులు వెంటనే తన సాధన పత్రికలో “The Voice of Rayalaseema” పత్రకకు ఉపశీర్షిక చేర్చి విస్తృతంగా ప్రచారం చేసాడు. రాయలసీమ నామకరణం వెనుక ఇంత నేపథ్యం ఉంది.

ఈ ప్రాంతం సీడెడ్ పదాన్ని, దత్తపదాలను వదులుకొని తొంబైసంవత్సరాలవుతున్నా ఇప్పటికీ సినిమా పరిభాషలో డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఈ పదాన్ని పదే పదే ప్రకటించి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారో అర్థంకాదు. ఇప్పటికే సీమ ప్రజాసంఘాలు సినిమాలలో సీమను అవమానించే వ్యవహారం పై చాలాసార్లు స్పందించారు. నిరసనలు వ్యక్తం చేసారు.

రాయలసీమ ప్రాంతంలోని మా జీవితం, భాష ఇప్పటికే మీకు ఒక వ్యాపర సరుకయింది. దాని వల్ల ఈ ప్రాంతం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత నష్టపోతోందో మాకు తెలుసు. ఇప్పుడు మా పేరుకూడా మాకు దక్కనీయకుండా చేసే కుట్రలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం.

సినిమా నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లకు, పత్రికల సంపాదకులకు మా అభ్యంతరాలను లేఖ రూపంలో పంపుతూ తెలియచేస్తున్నాం.

మీ వైఖరిలో మార్పురావాలని కోరుతున్నాం. ఒక ప్రాంతాన్ని పదే పదే గాయపరుస్తూ, అవమానపరుస్తూ ఉంటే అందుకు చట్టంలో ఏ రకమైన శిక్షలున్నాయో పరిశీలించుకోవాలని తెలియచేస్తున్నాం.

చట్టం కూడా మాకు సహకరించని పక్షంలో రాయలసీమ సీమ వారసులుగా మేము ఎలా సమాధానమివ్వాలో సమీపకాలమే నిర్ణయిస్తాది.

Share.