ఎంపీ గారూ..కాస్త పద్ధతిగా మాట్లాడండి!

సొంత పార్టీ నేతపై స్మృతి ఇరానీ ఆగ్రహం

డిల్లీ: కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ..సొంత పార్టీ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో చట్టం-2019 బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో భాజపాకు చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎంపీ హర్‌నాథ్‌సింగ్‌ యాదవ్‌ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన స్మృతి ఆయనకు గట్టి క్లాస్‌పీకారు.

‘ లైంగిక దాడులు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి?

ఎందుకొస్తున్నాయి? ఓసారి నా స్నేహితుడు నా వద్దకు వచ్చి పోర్నోగ్రపీ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను పాప్‌కార్న్‌ గురించి విన్నాను. కానీ పోర్న్‌ గురించి ఎప్పుడూ వినలేదు. ఇక సోషల్‌ మీడియా ప్రభావం పిల్లల మీద ఎంతో ఉంటుంది. ఉదాహరణకు పిల్లలకు సత్య హరిశ్చంద్రుడి సినిమా చూపిస్తే..మంచి మనిషిగా మారడం ఎలాగో వాళ్లకి తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకు ‘మున్నీ బద్నాం హూయి’, ‘చక్నీ ఛమేలీ’ వంటి పాటలు చూపిస్తే ఎలా. వారి మనసు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి సత్యహరిశ్చంద్ర, ఈ పాటల్లో ఏవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి?’ అని హర్‌నాథ్‌ అన్నారు.ఎంపీ మాట్లాడుతుండగా స్మృతి అడ్డుకున్నారు. సభలో మాట్లాడే సంస్కృతి ఇది కాదన్నారు. ఆమె మాట్లాడుతూ..‘మీ ఆందోళన వ్యక్తం చేయాలనకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. పద్ధతిగా మాట్లాడండి. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ సభను దేశం మొత్తం చూస్తోంది. ఇక్కడ సభలో ఎంతో మంది మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు మీ సమస్యను చెప్పాలనకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి’ అంటూ ఆయన మీద స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు

Share.