అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త: సీఎం చేతుల మీదుగా చెక్కులు


ఎంతోకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో రేపు(నవంబర్ 7వ తేదీ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు ఇవ్వనున్నారు.

రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. తర్వాతి దశలో రూ.20వేల లోపు డిపాజిట్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం. ప్రతి బాధితుడికి న్యాయం చేసేలా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.264 కోట్లను విడుదల చేసింది.

విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని 19.19 లక్షల మందితో రూ.6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించింది. అయితే టైమ్ పిరియడ్ ముగిసినా కూడా బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది.

ఈ క్రమంలోనే మోసపోయిన తమను ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్‌ బాధితులు వైఎస్‌ జగన్‌ని కోరారు. వారికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలుత అందులోంచి రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబరు 18న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Share.