జగనన్న అమ్మఒడి’కి అర్హతలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్‌లో ఆమోదం తెలిపిన పథకం ‘జగనన్న అమ్మ ఒడి’.. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలు, ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే వారి తల్లులు, వారి సంరక్షులకు ఈ పథకం కింద డబ్బులు ఇవ్వనున్నారు. 2020 సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి అమ్మఒడి పథకం కింద ప్రతీ తల్లికి డబ్బులు అందజేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేందుకు విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు జీవో 79 ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యార్ధులకు మాత్రమే ఈ పథకం కింద రూ. 15వేలు అందనుంది. ఒక వేళ విద్యార్ధికి తల్లి లేకుంటే ఆ పిల్లల అధికారిక సంరక్షకునికి ఈ పథకం కింద డబ్బులు అందజేస్తారు.

అమ్మఒడి పథకానికి అర్హతలు:
*కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కసారి మాత్రమే తల్లికి పథకం వర్తిస్తుంది

  • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి కచ్చితంగా ఉండాలి.
    *లబ్ధిదారులకు లేక తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
    *ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు ఉండాలి.
    *రేషన్‌ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలిస్తారు.
    *స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో ప్రవేశం పొందిన అనాథలు/వీధి పిల్లలకు సంబంధిత శాఖలతో సంప్రదించి అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తారు.
    *విద్యార్థులు కనీసం 75శాతం హాజరు కలిగి ఉండాలి.
    *పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు.
  • గ్రామ వాలంటీర్లు, సచావాలయాల వ్యవస్థ ద్వారా విద్యార్థులు, లబ్ధిదారులను గుర్తిస్తారు.
    *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ చేసేవాళ్లు ఈ పథకానికి అర్హులు కాదు.

రూ.15వేలు చెల్లించేది ఇలా..
*అర్హులైన ప్రతి లబ్ధిదారు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతా కలిగి ఉండాలి.
*అర్హులైనవారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ.15వేలు జమ అవుతుంది.
*ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తారు. దీన్ని కమిషనర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌కు లింకు చేస్తారు.
*ఆయా విద్యాసంస్థలు అందించే విద్యార్ధుల డేటాను చైల్డ్‌ ఇన్ఫో, యూడైస్, సివిల్‌ సప్లయ్‌ డేటాలతో సరిపోల్చుతారు.
*ఆ డేటాను సంస్థ తరఫున ఉండే తనిఖీ అధికారి ధ్రువీకరించాలి.
*అనంతరం డీఈఓ, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్ధిదారుల ఖాతాలోకి జమచేస్తారు.
*గ్రామ వలంటీరు స్కూలు డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలి. తన పరిధిలో తల్లి, లేదా సంరక్షకులు ఎవరు? అనేది వాలంటీర్ గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మాలో వారి వివరాలు సేకరించి, ఎంఈఓలకు సమర్పించాలి.
*డీఈఓ, ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి.
*పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు, లబ్ధిదారులే బాధ్యులు అవుతారు.
*డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటీ, సివిల్‌ సప్లయిస్, రియల్‌ టైమ్‌ గవర్నెన్సు విభాగాలు సాంకేతిక సహకారంతో పనిచేయాలి.
*లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు వీలుగా ఉంచాలి.

Share.