దోనకొండ రాజధాని ? : ఎకరా రూ. 60 లక్షలు!

ప్రకాశం జిల్లా దోనకొండ రాజధాని అవుతుందన్న ప్రచారంతో అక్కడి భూములకు డిమాండ్‌ పెరిగింది. వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు భూములు కొనేందుకు ఎగబడుతున్నారు. దోనకొండకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎకరా 60 లక్షలు పలుకుతోంది. రోజుకు 10, 20 ఉండే రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా 70 వరకు పెరిగాయి. ప్రతిరోజు కొత్తకొత్త కార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరుగుతుండడంతో గతంలో ఎప్పుడూ లేని సందడి నెలకొంది.

ఏపీ విభజన అనంతరం రాజధాని, ఇతరత్రా విషయాల్లో అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని నియమించింది. దోనకొండ ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చింది ఈ కమిటీయే. ఇటు కోస్తాకు..అటు రాయలసీమకు అనువైన ప్రాంతంగా కమిటీ తేల్చింది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ భూములు అధికంగా ఉన్నాయి. అయితే..నివేదిక ఇచ్చిన అనంతరం బాబు దీనిని పెడచెవిన పెట్టి..పంట భూములు కలిగిన అమరావతిని రాజధానిగా ప్రకటించిందని వైసీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంపై ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కృష్ణా వరదలు చూసిన తర్వాత అమరావతి అంత సేఫ్ ప్లేస్ కాదంటున్నారు. దీంతో జగన్ సర్కార్ దోమకొండను రాజధానిగా ప్రకటిస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అటవీ భూములు వందల ఎకరాల్లో ఉండడం వల్ల ప్రభుత్వం అంతగా భారం పడదనే చర్చ జరుగుతోంది. మరి రాజధాని దోనకొండను ప్రకటిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Share.