ఏపీ కేబినెట్ నిర్ణయాలు : బాలకృష్ణ వియ్యంకుడి భూముల లీజ్ రద్దు

జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టిన 498.3 ఎకరాల భూ కేటాయింపులను ఏపీ కేబినెట్ రద్దు చేసింది. విశాఖలో లులూ గ్రూప్‌నకు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019, అక్టోబర్ 30వ తేదీన సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియచేశారు.

ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే వారి తల్లులు, వారి సంరక్షులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. తెల్లరేషన్ కార్డు లేనిపక్షంలో దరఖాస్తు చేసుకున్న పత్రాన్ని జమ చేసిన సరిపోతుందన్నారు. జనవరి మాసంలో సీఎం జగన్ ప్రారంభించిన వెంటనే..అదే రోజు..తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకానికి రూ. 6 వేల 450 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

గుర్తించబడిన 77 మండలాల్లో అదనపు పౌష్టికాహారం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గర్భవతులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. 77 మండలాల్లో రక్తహీనత, పౌష్టిక లోపం ఉందని ఇందుకు రూ. 305 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు. ఇందులో కేంద్రానికి సంబంధించిన రూ. 47 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి అంగీకారం తెలిపిందన్నారు.

మరిన్ని నిర్ణయాలు : –

అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో 300 చ.గ. వరకు రెగ్యులరైజ్
9 కోస్తా జిల్లాలో వైఎస్సార్ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు.

వైఎస్సార్ అగ్రీ ల్యాబ్‌ల ఏర్పాటు. గ్రామీణ నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు.
విత్తనాలు, ఎరువులు ల్యాబ్‌లో పరీక్షించి ఇవ్వాలి.
మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు.
కిడ్నీ వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 5 వేలు.
రోబో శాండ్ తయారీ యంత్రాల కొనుగోలు.
స్టోన్ క్రషింగ్ యూనిట్లను రోబో శాండ్ యూనిట్‌లుగా మార్చుకొనేందుకు నిర్ణయం.
రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు సబ్సిడీ.
హోం శాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Share.