కేఏ పాల్ కు అరెస్ట్ వారెంట్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. ప్రపంచ శాంతి దూతగా చెప్పుకునే కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది మహబూబ్ నగర్ జిల్లా కోర్టు. కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్నారు కేఏ పాల్.

అయితే విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ కేసు విచారణ కోసం మిగతా నిందితులు కోర్టుకు హాజరవుతున్నా కేఏ పాల్‌ మాత్రం హాజరుకాట్లేదు. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ఆయనకు వారెంట్‌ జారీ చేసింది.

2010 ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగిఉన్న కారులో కేఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. ఈ కేసు విషయంలో అప్పట్లో కేఏ పాల్ ను అరెస్ట్ కూడా చేశారు. డేవిడ్ రాజుకు, కేఏ పాల్ కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి.

ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కేఏ పాల్ హత్య చేయించి ఉంటారని అప్పట్లో అనుమానించిన పోలీసులు కేఏ పాల్ ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ సౌ బయటకు వచ్చిన కేఏ పాల్ కు విచారణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సిందిగా పలు మార్లు నోటీసులు పంపింది కోర్టు. అయినా కూడా ఆయన స్పందించకపోవడంతో ఈసారి అరెస్ట్ వారెంట్ జారీచేసింది.

Share.