పోలీసులకు ధైర్యముంటే జగన్ పై రౌడీషీట్ తెరవండి

టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, వైసీపీ నేతలు, సీఎం జగన్ పై సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుని ఖండించిన చంద్రబాబు.. ధైర్యముంటే సీఎం జగన్ పై రౌడీషీట్ ఓపెన్ చెయ్యాలని పోలీసులకు సవాల్ విసిరారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు వాపోయారు. సొంత బాబాయ్ ని ఇంట్లో చంపేస్తేనే దిక్కు లేదన్నారు చంద్రబాబు. ఇంతవరకు వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి ఎలాంటి ప్రొగ్రెస్ లేదన్నారు. జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ఎప్పుడు ఏ పదవి తీసేస్తాడో ఆయనకే తెలియదన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్మాదిలా మారొద్దని వార్నింగ్ ఇచ్చారు.

రెండో రోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ శ్రేణులతో బాబు సమావేశమయ్యారు. వేధింపుల గురించి పుంగనూరు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని.. రౌడీ షీట్ తెరిచారని చంద్రబాబు ముందు వాపోయారు. కార్యకర్తలను వేధించడం సరికాదన్నారు చంద్రబాబు. అక్రమ కేసులపై స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రతిపక్షాలను వేధించడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

చట్ట ముందు అందరూ సమానమేనని చంద్రబాబు చెప్పారు. అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. రౌడీ షీట్‌కు సంబంధించి నిపుణులు పరిశీలించి.. కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. స్థానిక కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టినవారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై తిరిగి కేసులు పెడతామని తేల్చిచెప్పారు.

Share.