చంద్రబాబు స్వార్థమే పోలవరానికి శాపం


గడచిన ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల పుణ్యమా అని పోలవరం ప్రాజక్ట్ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాక ప్రాజెక్ట్ అంతరాష్ట్ర వివాదాల్లో పడి విడదీయరాని చిక్కుముడులు ఏర్పడ్డాయి. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కాంట్రాక్టర్ ప్రయోజనాలను ప్రాధాన్య అంశంగా తీసుకుంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాలని పట్టించుకోకుండా కేవలం ఇంజనీరింగ్ పద్దతులను పాటించి ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. ఆలా పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అవి పట్టించుకోకుండా కేవలం స్వార్ధ ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంది. అదే ఇపుడు ప్రాజెక్ట్ పురోగతికి గుదిబండగా మారాయి.
పునరావాసాన్ని పట్టించుకోని టీడీపీ సర్కార్
ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పునారావాస సహాయక చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలు ఎదురవుతున్నాయి. దాంతో సమస్య మళ్లీ సుప్రీం కోర్టు గడపకు చేరింది. బాబు పాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రాజెక్ట్ ని మరింత వివాదాల్లోకి నెట్టే సమస్య ముదిరి పాకాన పడేలా తయారుచేసారు. తాజాగా పనులు ఆపివేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగానూ, రాష్ట్ర ప్రయోజనాల పరంగా ప్రాజెక్ట్‌కు అవరోధాలు ఎదురవుతాయేమోనని ఆందోళన అధికారుల్లో ఏర్పడింది. ఈ సమస్యల ప్రకంపనల నుంచి బయటపడేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.న్యాయ వివాదాల నుంచి బయటపడేందుకు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టిస్తున్నారు.
ఆనాటి ప్రభుత్వానికి పట్టని ముంపు సమస్య
కనీసం 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని ఎదుర్కొనే విధంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఒడిశా రాష్ట్రంలోని ప్రాంతాలు ముఖ్యంగా అటవి ప్రాంతాల ముంపునకు గురవతాయని, దానివల్ల గిరిజనులు నష్టపోతారని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పనులు వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలనే ఆ రాష్ట్ర విజ్ఞప్తిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా దీనిపై సమాధానాలు దాఖలు చేయాల్సి ఉంది. ప్రభుత్వాలకు అదేమీ కష్టం కాదుగానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా చంద్రబాబు ప్రభుత్వం నిర్ల్యక్షంగా ప్రాజెక్ట్ పనులును అరకొరగా చేపట్టి చేతులు దులుపుకోవడంతో పాటు పునరావస పునర్నిర్మాణం పనులను నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ముందు కొత్త చిక్కుల వచ్చిపడే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు అంటున్నారు.
ఆర్ఆర్ పనులకు రూ.32,509 కోట్లు
ఈ ప్రభుత్వం వచ్చాక పోలవరం పనులు నిలిచిపోయాయంటూ టీడీపీకి చెందిన మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోంది. జలవిద్యుత్కేంద్రం పనులు కోర్టు ఆదేశాలవల్ల అప్పగించకపోయిన జలాశయంలోని ప్రధానమైన పనులన్నీ చురుగ్గానే జరుగుతున్నాయి. ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాలకు బలం చేకూర్చేలా పునరావాస పునర్నిర్మాణ (ఆర్ఆర్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇవే ఇప్పుడు సమస్యగా మారాయి. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 51,424 కోట్లు అని భావిస్తుండగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనులకు 32,509 కోట్లు ఖర్చు చేయాలి. పోలవరంలో నిర్మాణ పనులకన్నా వాటికే ఎక్కువ వ్యయం అవుతుంది. 2013లో అమలోకి వచ్చిన ఆర్ఆర్ చట్టం పటిష్టమైనది. ఇందులో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
కాంట్రాక్టర్ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత
ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన అనుమతులన్నీ అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వమే సాధించింది. మొత్తం 13 అనుమతులకుగాను 11 అనుమతులు వైఎస్ హయాంలోనే లభించాయి. అందులో భూసేకరణ, ఆర్ఆర్ ప్రణాళికకు సంబంధించిన గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, ప్రణాళిక సంఘం నుంచి నాడు వైయస్ అనుమతులు సాధించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణానికి టెండర్ పిలవగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అదే కాంట్రాక్టర్కుపనులు చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ పనులు అప్పగించి, తమ అనుయాయులకు సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. దానివల్ల ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు భూసేకరణ, ఆర్ఆర్ ప్రణాళిక సమాంతరంగా అమలు చేయాలి. కానీ ఆయన కాలంలో నిర్మాణ పనులు ఇంజనీరింగ్ నియమనిబంధనలకు విరుద్ధంగా నామమాత్రంగా జరిగాయి. ప్రధానంగా స్పిల్‌వే పనులు చేపట్టాల్సి ఉండగా దానిని పూర్తిగా విడిచిపెట్టి కాఫర్ డ్యాం చేపట్టారు. దీనివల్ల అసలు పనులు ఆగిపోయాయి. అదే సమయంలో వరదలు సంభవించినప్పుడు భారీగా నీరు స్పిల్‌వే నుంచి పోవడం వల్ల ముంపు తీవ్ర స్థాయికి చేరింది. గత ఏడాది వర్షాకాలంలో గోదావరికి భారీ వరదలు సంభవించాయి. అప్పుడు పనులు నిలిచిపోవడమే కాకుండా ఎగువ భాగంలో భారీ స్థాయిలో ముంపు సమస్య తలెత్తింది. జనవరి వరకూ కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన వర్క్స్ స్పేస్ లేకుండా పోయింది. నిర్మాణ పనులకు అవసరమైన రహదారులు వంటి మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం, ఇంజనీరింగ్ వైఫల్యాను సవరిస్తూ రాజకీయాకు, కాంట్రాక్టర్ ప్రయోజనాలకు అతీతంగా ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనులను చేపట్టింది. వచ్చేఏడాది ఏప్రిల్ నాటికి ప్రధాన పనులన్నీ, జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
కాఫర్ డ్యామే ప్రధాన కారణం
కాఫర్ డ్యామ్ వల్లనే ముంపు సమస్య తలెత్తి పనులు ఎక్కువ కాలం నిలిచిపోయాయి. ఇప్పట్లో ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదని అప్పట్లోనే చంద్రబాబుకు తెలుసు. అందుకే కాఫర్ డ్యాం పేరుతో కపట నాటకం సాగించారు. 50వేల కోట్లకుపైగా వ్యయం చేసి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం మడమతిప్పి చేతులెత్తేయటంతో కాఫర్ డ్యాంను పూర్తిచేసి దానినే పోలవరం ప్రాజెక్ట్ గా చిత్రీకరించేందుకు ఆయన వ్యూహం పన్నారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజీ తరహాలో కాఫర్ డ్యాం నిర్మాణం విషయంలో అవగాహన వచ్చింది. దీనిని 42.5 మీటర్ల ఎత్తులో నిర్మించాలని బాబు ప్రభుత్వం తెరమీదకు తీసుకురాగా అందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తు తగ్గించి నిర్మించే విధంగా డిజైన్‌లో మార్పులను ఎన్‌హెచ్‌పీసీ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) ఆమోదం తెలిపింది. నాడు కేంద్రం మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఇందుకు అంగీకరించింది.
కపట నాటకం…
కాఫర్ డ్యాం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్రనష్టం కలిగించాయి. జలాశయాల నిర్మాణా చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కాఫర్‌డ్యాం నిర్మించి దాని ద్వారా పోలవరం మొదటిదశ పూర్తయినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు కుట్రపన్నారు. పోలవరానికి ప్రత్యామ్నాయంగా కాఫర్‌డ్యాంను కనిపెట్టేసినట్లు చెప్పుకున్నారు. ఇంకేముంది ఇంజనీర్ల ప్రతిభ అంత ఆయన ముందు వృధాపోయింది. విధిలేక ఇంజనీర్లు దీనిని పోలవరానికి ప్రత్యామ్నాయంగా 42.5 మీటర్లతో తొలి ఒప్పందానికి విరుద్ధంగా రూపొందించారు. ఈ విధంగా కాఫర్‌డ్యాంను ఎత్తు పెంచి నిర్మించేందుకు అనుమతించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటానికి కారణం లేకపోలేదు. పోలవరానికి మంగళం పాడేందుకే కాఫర్‌డ్యాం ఎత్తు పెంచే కుట్ర రంగంలోకి తెచ్చారు చంద్రబాబు.
డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం మొదటిదశ 2018 నాటికి పూర్తి చేస్తామని బాబు చెప్పుకున్నారు. అది పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో కాఫర్డ్యాంనే (అంటే జలాశయ నిర్మాణానికి నీరు అడ్డు రాకుండా నిర్మించే మట్టికట్ట) పోలవరం మొదటిదశగా చెప్పుకుని రాజకీయ లబ్ది, కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం అప్పటి నుంచే ‘స్కెచ్’వేసేశారు. కానీ దానిని కూడా పూర్తి చేయలేకపోయారు.
ప్రధాన జలాశయంలో నిర్మాణ పనులు జరిగేటప్పుడు నీరు అడ్డురాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం కాఫర్ డ్యాం. ఇది ఏమాత్రమూ పటిష్టంగానూ, స్థిరంగానూ ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అటువంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ నిల్వఉండే నీటిని చూపించి మొదటిదశ పూర్తయిందనిపించుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల అదనపు భారం కావడంతోపాటు కాంట్రాక్టర్ మాత్రం లాభం పొందారు.
చంద్రబాబు పనివల్ల గత ఏడాది వరదలప్పుడు ఎంత నష్టం జరిగిందో చూశాం. ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం ఆ వరదల విషయాన్ని నమ్మించే విధంగా సుప్రీంకోర్టు ముందుచుతోంది. అదే సమయంలో సహాయ పునరావస చర్యల్లో భాగంగా భూసేకరణ, ఆర్ఆర్ ప్లాన్‌కు సంబంధించిన అంశాలు లేవనెత్తుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయంలో ఇప్పటిదాకా 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనుల కోసం 5వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులుతో పాటు ఆ పనులు కూడా సమాంతరంగా జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి నీరు అందించే విధంగా పోలవరం పూర్తవుతుంది. కానీ భూసేకరణ, ఆర్ఆర్ పనులు అదే స్థాయిలో జరగడం లేదు. జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇందుకు నిధుల సమస్య కూడా కారణం.

ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిర్మాణ పనులుకు మాత్రమే నిధులు సమకూరుస్తామని ఇతర అంటే భూసేకరణ, ఆర్ఆర్ పనులకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గతంలో చంద్రబాబు ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడిచేసి సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా పనులను తమ వారికి అప్పగించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా కాంట్రాక్టర్ మార్పు, తమ వారు సబ్కాంట్రాక్టర్లుగా పనులు చేపట్టడం, స్పిల్‌వేను విస్మరించి కాఫర్ డ్యాం నిర్మించడం మొదలైనవి ఆయన చేసిన ఘోరమైన తప్పిదాలు.

కేంద్రం చేత భూసేకరణ, ఆర్ఆర్ పనులు చేపట్టే విధంగా ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తాజాగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అది సాధ్యమైతేనే నిర్మాణ పనులతోపాటు భూసేకరణ, ఆర్ఆర్ పనులు సమాంతరంగా, సులభంగా చేపట్టవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ పూర్తవుతుంది కానీ ముంపు బాధితుల గురించి పట్టించుకునేవారు ఉండరు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారిని క్షేమంగా ఇతర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ వసతులతో నిర్మించకుండా తరళిస్తే ఆర్ఆర్ చట్టం ఒప్పుకోదు. అందువల్ల నీటిని నిల్వ చేయడం వీలుపడదు. అదే సమయంలో ఆర్ఆర్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆపివేసే ప్రమాదం ఉంది. దీని నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Share.