కమ్మరాజ్యంలో కడపరెడ్లుపై పోలీసులకు ఫిర్యాదు

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై కాంగ్రెస్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్, కథ, లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ను నిషేధించాలని, సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ పెట్టారని, అతనిపై కులాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని, కులాల పేరిట కాదని లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

Share.