ఏపీ కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల

కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం
కోట్ల టీడీపీలో జంప్ ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ?
కర్నూలు : ఎన్నికలు రానే రాలేదు..అప్పుడే హస్తం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యతిరేకించారు. టీడీపీ – కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటే లాభమని..ఒంటరిగానే పోటీ చేస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశం మధ్యలోనే కోట్ల వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీలోకి జంప్ :
దీనితో ఆయన పార్టీ జంప్ అవుతారని..టీడీపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. జనవరి 25వ తేదీన కర్నూలులో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు…అందరూ హాజరు కావాలని కోట్ల నుండి సంకేతాలు వెళ్లాయి. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కోట్ల యోచించారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో మీటింగ్ పెండింగ్‌లో పెట్టారు. అయితే..త్వరలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలని కోట్ల ఆలోచిస్తున్నారు.
కర్నూలులో మంచి పట్టున్న నేత :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఈయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నేతలు పార్టీకి టా..టా చెప్పేసి ఇతర పార్టీల కండువాలు కప్పుకున్నారు. అయితే..కోట్ల మాత్రం పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోట్ల…కూడా పరాజయం చెందారు. కర్నూలు జిల్లాలో కోట్ల సీనియర్ నేతగా ఉండడమే కాకుండా..జిల్లాలో మంచి పట్టున్న నేత. మరి కోట్ల జంప్ అవుతారా ? జంప్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందా ? చూద్దాం.

Share.