పెళ్లి కూతురుకు కరోనా..పెళ్లికి హాజరైన వారు క్వారంటైన్ కి తరలింపు

పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ వచ్చినా దాచి పెట్టి పెళ్లి చేయటంతో.. పెళ్లికి హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలించారు భోపాల్ పోలీసులు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, రైజన్‌ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి మంగళవారం,మే19న పెళ్లి జరిగింది.

ఈ పెళ్లికి 32 మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు, పురోహితుడు సహా.. అందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. వారు కాంటాక్ట్ అయిన వారిని తెలుసుకునే పనిలో పడ్డారు. పెళ్లికి వారం రోజుల ముందు ఆ మహిళ జ్వరంతో బాధపడగా.. దానికి సంబంధించిన మందులను వాడింది.

ఈ క్రమంలో ఆమెకు జ్వరం తగ్గినప్పటికీ.. ఆమె కుటుంబసభ్యులు పెళ్లికి ముందు మే16న మరోసారి కరోనా పరీక్షను చేయించారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ వివాహానికి భోపాల్ ఇండోర్,గ్వాలియర్ లనుంచి వారి బంధువులు చాలా మంది వచ్చారు. ఇప్పడు అధికారులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. లాక్ డౌన్ కాలంలో సడలింపులు ఇచ్చినా సరైన జాగ్రత్తలు పాటించక పోవటంతో ఇలాంటి ఘటనలు ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.

లాక్ డౌన్ సడలింపులు తర్వాత గత 15 రోజుల్లో మధ్యప్రదేశ్ లో 100 కి పైగా పెళ్లిళ్లు జరిగాయి. కరోనా లాక్ డౌన్ విధించటానికి ముందు కుదుర్చుకుని ముహూర్తాలు పెట్టుకున్న దాదాపు 14 వేల వివాహాలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Share.