కరోనా వైరస్‌ బారిన పడిన రోగుల్లో ఎక్కువ మంది విటమిన్‌ ‘డి’లోపం

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌పై చేస్తున్న పరిశోధనల్లో నిత్యం కొత్త విషయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ వ్యాధికి సంబంధించి స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు మరో కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. కరోనా వైరస్‌ బారిన పడిన రోగుల్లో ఎక్కువ మంది విటమిన్‌ ‘డి’లోపం కలిగి ఉన్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అంశాలను స్పెయిన్‌కు చెందిన క్లినికల్‌ ఎండోక్రినాలజీ, మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించారు.
‘కరోనా వైరస్ సోకిన 200 మంది రోగులపై పరిశోధన చేశాం. వారిలో దాదాపు 80శాతం మంది విటమిన్‌ ‘డి’లోపంతో బాధపడుతున్నారు. విటమిన్‌ డి లేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. ఈ సమస్యను ముందుగా గుర్తించి, చికిత్సకు వెళ్లడం ఎంతో ముఖ్యమైన విషయం. రక్తంలో ఆ విటమిన్‌ సమృద్ధిగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. విటమిన్‌ ‘డి’ రక్తంలో కాల్షియం సాంద్రతను నియంత్రిస్తుంది’ అని కాంటబ్రియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జోస్‌ హెర్నాండేజ్‌ తెలిపారు. విటమిన్‌ డి లేమికి, వ్యాధుల తీవ్రతలకు మధ్య సంబంధాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని పరిశోధకులు చెప్పారు.

Share.