మాస్క్ కంపల్సరీ..లేకపోతే..Rs.1000 ఫైన్

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వైరస్ విస్తరించకుండ ఉండేందుకు ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. 2020, మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ ధరించకపోతే..మాత్రం రూ. 1000 ఫైన్ వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు 2020, మే 08వ తేదీ శుక్రవారం ఉదయం..జీవో జారీ చేసింది. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో…ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రమంతటా..రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఆసుపత్రులు, మెడికల్స్ షాపులు మినహా..అన్ని రకాల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలి. ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పూజలు, మత ప్రార్థనలు నిషేధించారు. రెడ్‌ జోన్స్‌లో రెస్టారెంట్లు, బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌ సర్వీసులు, ఆటో రిక్షాలకు అనుమతి లేదు.

గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో నిర్మాణ పనులు చేసుకోవచ్చు. అయితే..రెడ్‌జోన్లతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానికంగా ఉండే కార్మికులతోనే పని చేయించు కోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్‌ మినహా అన్ని రకాల షాప్‌లకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. GHMC రెడ్‌జోన్‌ కాని పట్టణాలలో షాప్‌లకు అనుమతి. మార్కెట్లు, మాల్స్‌, కాంప్లెక్స్‌లకు అనుమతిలేదు. అయితే షాప్‌లను భౌతికదూరం పాటించే విధంగా రోజు విడిచి రోజు తెరువడానికి మాత్రమే అనుమతి. దీనికి సంబంధించిన రోస్టర్‌ను అమలు చేసేలా మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి.

Share.