‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్

*ఐసీఎంఆర్ – కోవాగ్జిన్: ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’.. *

హైదరాబాద్ నుంచే టీకా ఉత్పత్తి

కరోనావైరస్ నుంచి భారత్ బయటపడే రోజులు దగ్గర్లోకి వస్తున్నాయా అంటే అవుననే అంటోంది భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్).

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ వడివడిగా అడుగులు వేస్తోంది.

ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న భారత్ బయోటెక్ సహా మిగతా ఇనిస్టిట్యూషన్లకు లేఖ రాశారు.

లేఖలో ఏముందంటే..

‘‘కోవిడ్ వ్యాక్సిన్ తీసుకురావడంలో భాగంగా క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కలిసి పనిస్తున్నాం.

దేశీయంగా తయారవుతున్న తొలి వ్యాక్సిన్ ఇది. దీన్ని భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పర్యవేక్షిస్తోంది.

క్లినికల్ ట్రయల్స్ త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవడానికి కృషి జరుగుతోంది.భారత్ బయోటెక్ ఈ దిశగా పనిచేస్తుంది..

అయితే, ఈ ప్రాజెక్టులో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న అన్ని చోట్ల నుంచి సరైన సహకారం అందడంపై ఈ లక్ష్యాన్ని చేరుకోవడమనేది ఆధారపడుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖ నేపథ్యంలో ట్రయల్స్ పూర్తిగా విజయవంతమైతే కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రానుందని అర్థమవుతోంది.

ఇప్పటికే డీజీసీఏ నుంచి అన్ని అనుమతులు వచ్చినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

ఎక్కడెక్కడ ట్రయల్స్ జరుగుతున్నాయి..

డాక్టర్ బలరాం భార్గవ్ లేఖ ప్రకారం.. విశాఖ కేజీహెచ్, హరియాణాలోని రోహ్‌తక్ యూనివర్సిటీ, దిల్లీ ఎయిమ్స్, పట్నాలోని ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్.. కర్నాటకలోని బెలగావి, మహారాష్ట్రలోని నాగపుర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, తమిళనాడులోని ఎస్‌ఆర్ఎం నగర్, ఒడిశాలోని భువనేశ్వర్, గోవాలోని వివిధ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.

Share.