రాజమహేంద్రవరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. కాగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 52 మంది సిబ్బంది పని చేస్తారు.

21 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి, శిక్ష:
మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం దిశ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన దిశ చట్టం.. కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దిశ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఈ చట్టంలోని కొన్ని అంశాలపై మరింత వివరణ కోరడంతో… ఆ వివరాల్ని కూడా కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వస్తే… 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, దోషులకు 21 రోజుల్లోనే శిక్ష వేస్తారు. మహిళలకు భరోసా కల్పించేలా ఈ చట్టం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

* ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ప్రారంభం
* దిశ చట్టం సమర్థంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు
* చట్టం అమల్లోకి వస్తే.. అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి, శిక్ష

Share.