సీఎం జగన్ కీలక నిర్ణయం : ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ……


ఏపీ సీఎం జగన్ విద్యా రంగంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యపై. ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చేయనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా సర్కారీ స్కూల్స్ ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. 2020 నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో 1 వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోదిస్తారు. ఆ తర్వాత ఏడాది అంటే 2021 నుంచి 9వ తరగతి, 2022 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమం కొనసాగాలి. సిలబస్ చాలా బలోపేతంగా ఉండాలి’ అని సీఎం జగన్ అధికారులతో చెప్పారు.

విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ తమ సిఫార్సులను సీఎంకి వివరించారు. పాఠశాల విద్య, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించి కమిటీ సిఫార్సులపై చర్చించారు. సిఫార్సుల్లో కూడా కమిటీ భాగస్వామ్యం కావాలని సీఎం చెప్పారు. రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు.

సీఎం జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది మంచి పరిణామం అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం కారణంగానే చాలామంది ప్రైవేట్ స్కూళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. తాము పెద్దగా చదవుకోక పోయినా తమ పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదవాలని ఆశ పడుతున్నారు. అందుకే వేలు, లక్షలు ఖర్చైనా వెనుకాడకుండా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. కానీ అక్కడ పరిస్థితి మరోలా ఉంది.

ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటే… ప్రైవేటు స్కూల్స్ లో నెలకు రూ.10 వేలు ఇచ్చి టీచర్లను పెట్టుకుని స్కూళ్లు నడుపుతున్నారు. దీంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదు. తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతున్నాయి కానీ.. అక్షరం ముక్క కూడా రావడం లేదు. ఇప్పుడు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉందని, క్వాలిటీ విద్య అందుతుందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Share.