గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు, 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

విశాఖ గీతం యూనివర్శిటీలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ కొన్ని కట్టడాలను కూల్చివేశారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీగోడలో కొంత భాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బుల్‌డోజర్లు ఇతర యంత్ర సామగ్రితో అక్కడకు చేరుకున్న GVMC అధికారులు కట్టడాల తొలగింపును చేపట్టారు. విశాఖ ఆర్డీవో కిశోర్ ఆధ్వర్యంలో కూల్చివేత పనులు సాగుతున్నాయి.

తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం అంటోంది. అయితే అధికారులు మాత్రం 5 నెలల క్రితమే నోటీసులు ఇచ్చామంటున్నారు. యూనివర్శిటీలో మార్కింగ్ చేశామని చెబుతున్నారు. దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి నాటికి దేశంలో 50%మందికి కరోనా వస్తుంది: కేంద్ర కమిటీ

ఎండాడ, రుషికొండ పరిధిలో ఈ 40 ఎకరాలున్నాయి. బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ ఈ వర్శిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. కూల్చివేత సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. భారీగా బలగాలను మోహరించారు.

బీచ్‌రోడ్‌లో గీతంకు వెళ్లేదారిని రెండువైపులా మూసేసారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

గీతం విశ్వవిద్యాలయంలో 40 ఎకరాల ఆక్రమిత భూమిని గుర్తించామన్నారు ఆర్డీవో పెంచల్‌ కిశోర్‌. ఎండాడ, రుషికొండ సర్వే నంబర్లలో ఈ భూములు ఉన్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలో 30ఎకరాలు, ఇంజనీరింగ్ క్యాంపస్‌లో 10ఎకరాలు ఆక్రమిత భూమి ఉందన్న ఆయన.. మొత్తం 40ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇంజనీరింగ్ క్యాంపస్‌లో కొన్ని శాశ్వత కట్టడాలు ఉన్నాయన్న పెంచల్‌ కిశోర్‌.. ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఐదు నెలల క్రితమే గీతం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు ఆర్డీవో పెంచల్‌ కిశోర్‌.

Share.