గుడ్ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహారంతో పాటు పలు కీలక అంశాలకు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు ధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధితో పాటు హైకోర్టులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలివ్వాలని నిర్ణయించింది. కొత్తగా 3 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు చేయడంతో పాటు ముదిరాజ్‌, ముత్తరాసి, తెనుగోళ్లు బీసీ కార్పొరేషన్‌, అలాగే నగరాలు, నాగవంశం బీసీ కార్పొరేషన్‌తో పాటు ఏపీ కల్లుగీత, నీరగీత బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు మరో 13 బీసీ కార్పొరేషన్లకు మేనేజింగ్‌ కమిటీ విధివిధానాల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. యానాదులు, చెంచులకు కూడా ఇళ్ల నిర్మాణంలో రాయితీ పెంచాలని ఈ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు..న్యాయం చేయాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. సంక్షేమ ఫలాలు ప్రతి పేద ఇంటికి అందేలా చర్యలు చేపట్టాలని డిసైడ్‌ అయింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పెదబోడేపల్లిలో ఏపీఆర్‌ హైస్కూల్‌ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. అలాగే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక కేటగిరిగా తీసుకుంది. ఇళ్లు నిర్మించుకునే పరిస్థితులో జర్నలిస్టులు లేనందున.. భూమి తీసుకుని ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి.. అవసరమైతే జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ను వాడుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే కేబినెట్‌లో టేబుల్ అంశంగా సోలార్ విండ్ పాలసీని తీసుకువచ్చింది.

Share.