అనంతపురం లో జ్వరాల దాడి… ఆసుపత్రుల దోపిడీ…


అనంతపురం గురించి మనం అరచేతిలో స్వర్గం చూస్తుంటే… ఈ రాష్ట్రంలో ప్రతి నగరం, ప్రతి పట్టణం వైరల్ జ్వరాలతో ముసుగుదన్ని మూలుగుతోంది. ‘స్మార్ట్ సిటీ’ అనంతపురం లో నైతే పరిస్థితి ఘోరంగా ఉంది. వైరస్ దాడికి రక్తం వేడెక్కి జ్వరాలొస్తే… ప్రయివేట్ ఆసుపత్రులు బాధితుల రక్తాన్ని జలగల్లా పీడించి పిప్పిచేస్తున్నాయి.

‘అంతా సూపర్’ అని తన భుజాలు తానే చరుచుకుంటున్న ప్రభుత్వం జ్వరాల విషయంలో ఏ మాత్రం బాధ్యతతో ప్రవర్తిస్తున్నట్లు కనపడడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరాలను ఘోరమైన వ్యాపారంగా మలుచుకుని దండుకుంటుంటే… పట్టించుకోకపోవడం దారుణం. డెంగ్యూ అని ఆసుపత్రిలో చేరితే 40 వేల నుంచి 70 వేల దాకా గుంజుతున్నారు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో మంచాలు దొరకటం గగనమవుతున్నది.

మొన్నీమధ్యన మన అనంతపురం లో పిల్లగాడొకడు… లండన్ నుంచి సెలవలకని అనంతపురం వచ్చాడు. రాగానే జ్వరం. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే… డెంగ్యూ పేరుతో రోజుకు లక్ష చొప్పున పది రోజుల్లో పది లక్షలు నాకేశారట. ఇందేంటని అడిగితే… వచ్చింది లండన్ నుంచి కాబట్టి కొద్దిగా నిరోధక శక్తి తక్కువుందని చెప్పారట. అక్కడి బీమా కంపెనీఈ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉండబట్టి సరిపోయింది. బ్లడ్ టెస్టుకు ఒకాయన నుంచి 13 వేలు గుంజారట. ఓర్నీ… ఇదేమి అఘాయిత్యం!

వైద్య బీమా ఉందని ఎవడైనా జ్వరపీడితుడు చెబితే చాలు… ఆసుపత్రులకు పండగే పండగ. చాలా అనైతికంగా ఈ వ్యాపారం సాగుతోంది. బాహాటంగా టెస్టుల మీద టెస్టులు చేసి ఐ సీ యూ లో పెట్టిపిండుకుంటున్నారు. ప్లేట్ లెట్ ల పేరుతో ఫలహారం లాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ దోపిడీని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటే బాగు.

గత రెండు నెలల నుంచి రాష్ట్రంలో ఉన్న అనారోగ్య పరిస్థితి చాలా ఆసాధారంగా ఉంది. ఇప్పటికే కాలమాన పరిస్థితుల దృష్ట్యా నోరు, కళ్ళు మూసుకున్న మీడియా దృష్టి పెట్టటడంలేదు గానీ…. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి జనాలను ఆడుకుంటే ప్రభువులకు పుణ్యం ఉంటుంది. ముందు మా ఆరోగ్యం సంగతి చూడండి సామీ.

Share.