కరోనా కేసుల్లో రష్యాను దాటిన భారత్‌

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. గత వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో రష్యాను వెనక్కి నెట్టిన భారత్‌ మూడో స్థానానికి చేరకున్నది. దేశంలో గత 24 గంటల్లో 425 మంది మరణించగా, కొత్తగా 24,248 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,53,287 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,24,433 మంది బాధితులు కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల దేశంలో 19,693 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో అత్యధిక కేసుల్లో భారత్‌ మూడోస్థానానికి చేరుకోగా, రోజువారీ మరణాల్లో కూడా మూడో ప్లేస్‌లోనే ఉన్నది. మొత్తంగా మరణాల విషయంలో ఎనిమిదో స్థానంలో ఉన్నది. రష్యాలో ప్రస్తుతం 6,81,251 కరోనా కేసులు ఉన్నాయి. ఇక 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులతో అమెరికా, 16,04,585 పాజిటివ్‌ కేసులతో బ్రెజిల్‌ దేశాలు భారత్‌ కంటే ముందున్నాయి.

దేశంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 5 వరకు 99,69,662 నమూనాలను పరీక్షించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఆదివారం 1,80,596 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

Share.