40 వేల ఐటీ ఉద్యోగాలకు ముప్పు

ప్రస్తుత ఏడాదిలో ఐటీ కంపెనీలు 30,000-40,000 మంది మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం టి.వి. మోహన్‌దాస్‌ పాయ్‌ తెలిపారు. వ్యాపారంలో వృద్ధి మందగించడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఇలా ఉద్యోగాలు పోవడం అయిదేళ్లకోసారి సాధారణంగా జరిగే అంశమేనని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) పాయ్‌ అన్నారు.

‘ఏదైనా పరిశ్రమ ఓ స్థాయికి వెళ్లాక మధ్య స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉండిపోతారు. కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నపుడు పదోన్నతులు వస్తే సరే. లేదంటే అవి మందగమనం పాలైనపుడు వేతనాలు అధికంగా పొందే వారిని స్థిరీకరించాల్సి వస్తుంది. అపుడు తొలగింపులు సహజమన్నారు. ఇది ప్రతి అయిదేళ్లకోసారి.. జరుగుతూనే ఉంటుంద’ని పాయ్‌ వివరించారు.

‘మీరు సరైన పనితీరును ప్రదర్శిస్తే సరే. లేదంటే భారీ వేతనం పొందడానికి అర్హత ఉండదు. పరిశ్రమ మొత్తం మీద 30,000 నుంచి 40,000 మంది బయటకు వెళ్లే అవకాశం ఉంద’ని పేర్కొన్నారు. అయితే ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్నా వారిలో తిరిగి 80 శాతం మందికి సాధారణంగానే ఉద్యోగావకాశాలు దోరుకుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

Share.