హై అలర్ట్ : టూరిస్టులు వెంటనే కశ్మీర్ ను ఖాళీ చేయండి


జమ్మూకాశ్మీర్ లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు వెంటనే వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రదాడులు జరుగుతాయన్న నిఘా వర్గాల హెచ్చరికతోనే ఈ ఆదేశాలు జారీ చేసింది. శ్రీనగర్ నిట్ కాలేజీ విద్యార్థులతోపాటు వందలాది సంఖ్యలో పర్యాటకులు స్వస్థలాలకు పోటెత్తారు. దీంతో శ్రీనగర్ ఎయిర్ పోర్టు రద్దీగా మారింది. శ్రీనగర్ కు కేంద్ర బలగాలు చేరుకుంటున్న క్రమంలో నిట్ విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచింది. నిట్ లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తెస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

జమ్మూకాశ్మీర్ లో కేంద్ర బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అమర్ నాథ్ యాత్రను టార్గెట్ చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని హోంశాఖ.. సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది. ఆగస్టు 03,2019 సాయంత్రం 5 గంటల వరకు నిట్ క్యాంపస్ ఖాళీ చేయాలని కేంద్ర హోంశాఖ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిట్ యాజమాన్యం విద్యార్థులందరినీ వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 విద్యార్థులు శ్రీనగర్ నిట్ క్యాంపస్ లో చదువుకుంటున్నారు. వారందరినీ శ్రీనగర్ నుంచి జమ్మూ రైల్వే స్టేషన్ కు తరలించే ఏర్పాట్లు చేశారు. రాత్రికి 150 మంది తెలుగు విద్యార్థులు జమ్మూకు చేరుకోనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను సంప్రదించారు. దీంతో కేటీఆర్ వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కూడా విద్యార్థులతో మాట్లాడారు. రైళ్లల్లో రావడానికి కొంత ఆలస్యమవుతుంది కనుక విద్యార్థులను జమ్మూ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చేందుకు మూడు బస్సులను ఏర్పాటు చేశారు.

జమ్మూ కాశ్మీర్ లోకి కేంద్ర అదనపు బలగాలు వెళ్లడం, రాజకీయ పార్టీల ఆందోళన, స్థానికులు కూడా భయాందోళనకు గురై ముందస్తుగానే నగదు, కావాల్సిన సరుకులు, పెట్రోల్, డీజిల్ వారి దగ్గర ఉంచుకుంటున్నారు. ఏ క్షణంలో ఎటువంటి పరిస్థితి వస్తుందోనన్న భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం రైల్వే రవాణా ఆలస్యమవుందని.. రైల్వే వ్యవస్థ ద్వారా కాకుండా బస్సుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను జమ్మూ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి..అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపనున్నారు. నిట్ విద్యార్థులు సహా చాలా మంది అమర్ నాథ్ యాత్రికులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు జమ్మూ నుంచి తిరుగు వెళ్తున్నారు.

Share.