జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ నిలిపివేత..మరి ఇండియాలో

చిన్న పిల్లలకు ఉపయోగించే పౌడర్ అమ్మకాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పేరు గడించింది. కానీ గత కొన్ని రోజులుగా పౌడర్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే అపవాదు ఈ సంస్థపై పడుతోంది. దీంతో విక్రయాలు తగ్గిపోతున్నాయి. తాజాగా..అమెరికా, కెనడా దేశాల్లో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆరోగ్య సమస్యల ఆరోపణలను తిప్పికొట్టింది. అమెరికాలో టాల్క్ – ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలా వరకు తగ్గుతోందని వెల్లడించింది. వేలాదిగా కేసులు నమోదు కావడం..కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాలు ఉండడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు ఇతరత్ర అంశాలు కంపెనీపై పెను ప్రభావం చూపాయని వెల్లడించింది.

సరఫరా ముగిసే వరకు రిటైల్ దుకాణాల్లో అమ్మకాలు కొనసాగుతాయని నార్త్ అమెరికా కన్స్జూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ తెలిపారు. 1890 లలోల బేబీ పౌడర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014 నుంచి కంపెనీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పౌడర్, ఇతర ఉత్పత్తుల్లో ఆస్ బెస్టాజ్ ఆనవాళ్లు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ పౌడర్ వాడడం వల్ల తమకు క్యాన్సర్ వ్యాధి సోకిందనే కేసులు నమోదయ్యాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షల్లో బాటిల్ బేబీ పౌడర్ లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్నారు.

అప్పటికే మార్కెట్‌లలో ఉన్న 33 వేల పౌడర్ బాటిళ్లను వెనక్కి తీసుకుంటామని సంస్థ వెల్లడించింది. న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో దాదాపు 16 వేలకు పైగా సూట్లు నమోదయ్యాయి. వీటిని అలబామా న్యాయవాది లీ ఓ డెల్ పర్యవేక్షిస్తున్నారు. అండాశయ క్యాన్సర్ కు కారణమైన సంస్థ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాదాపు..రూ. 400 కోట్లకు పైగానే పరిహారం చెల్లించాలనే డిమాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా..అండాశయ క్యాన్సర్ వస్తుందని, ఈ డబ్బును 22 మంది మహిళలకు చెల్లించాలనే కేసులు నమోదయ్యాయని సమాచారం. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలోనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ మాసంలో చివరిగా జరిగిన పరీక్షల్లో ఆస్ బెస్టాస్ ఆనవాళ్లు లేవని తెలిపింది.

Share.