వికాస్ దుబే పోలీసు ఎన్‌కౌంటర్లో మృతి

గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే పోలీస్ ఎన్‌కౌంటర్లో మృతి చెందాడన్న పోలీసులు. ఉజ్జయిని నుంచి కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయిలో ఒక వాహనం బోల్తా.

వికాస్ దుబే పోలీసు ఎన్‌కౌంటర్లో మృతి… కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడన్న పోలీసులు

కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు వికాస్ దుబేను ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మీదుగా కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కాన్వాయిలోని ఒక వాహనం బోల్తా పడింది.

ఏఎన్ఐ వార్తా సంస్థ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వికాస్ దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు.

గాయపడిన వికాస్‌ను ఆస్పత్రికి తరలించారు.

వికాస్ దుబేను ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో కాన్పూర్‌కు తీసుకువస్తున్నప్పుడు కాన్పూర్ చేరుకోగానే ఎస్టీఎఫ్ కాన్వాయిలో ఒక వాహనం బోల్తా పడిందని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

ప్రమాద సమయంలో పోలీసు అధికారి నుంచి వికాస్ పిస్తోలు లాక్కుని కాల్పులు జరిపారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆ అధికారి తెలిపారు.

ఈ ఘటనలో వికాస్ దుబే మరణించినట్లు పీటీఐ ధ్రువీకరించింది.

వాహనం బోల్తా పడటంతో కొంతమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని, అదే సమయంలో వికాస్ దుబే తప్పించుకోవడానికి ప్రయత్నించారని ఆ అధికారి చెప్పారు.

అనంతరం పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని వికాస్‌ను పోలీసులు కోరినప్పటికీ అతను కాల్పులు ప్రారంభించాడు

. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు కూడా కాల్పులు జరిపారని సమాచారం.

అయితే, వికాస్‌కు ఎన్ని బుల్లెట్లు తగిలాయన్న దానిపై ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Share.