జగన్‌ సీఎం కావడానికి కారణం అతనే : కేశినేని సంచలన పోస్టు

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో సంచలన పోస్టు పెట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌ సీఎం కావడానికి కారణం ఏబీ వెంకటేశ్వర్లు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీడీపీ ఓటమిలో ఏబీవీ కీలక భూమిక పోషించారని అన్నారు. సీఎం అయ్యాక ఏబీవీని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్‌ చేశారంటేంటి జగన్‌ గారూ..? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు కేశినేని నాని. కేశినేని నాని ట్వీట్ వైరల్ అవుతోంది.

కేశినేని నాని ట్వీట్‌పై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు
అటు ఎంపీ కేశినేని నాని ట్వీట్‌పై ఏబీ వెంకటేశ్వరరావు ట్విట్టర్ లో స్పందించారు. జగన్‌ని సీఎం చేశానని నాని అంటారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి కారణం నేనేనని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారని నాని ట్వీట్‌కి ఏబీవీ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ లో మీరు, వైసీపీ ఎంపీలు కలిసిమెటిసి ఉంటారుగా అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి అన్నారు. నేను వృత్తిధర్మం నిర్వహించానా లేక ఇంకేమైనా చేశానో స్పష్టత వస్తుందన్నారు.

ఏబీ. వెంకటేశ్వరరావు, కేశినాని ట్వీట్లపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఏబీ. వెంకటేశ్వరరావు, కేశినాని ట్వీట్లపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రజల రక్షణ కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం ఏబీవీ పని చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని ఆరోపించారు. 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పని చేశారని విమర్శించారు. పరికరాలు కొని తనతో సహా తమ నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారని తెలిపారు. ఒక మాఫియా నడిపారని విమర్శించారు. ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని తెలిపారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏబీపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు డీజీపీ నుంచి ఫిబ్రవరి 7న అందిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించింది.

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనల నియమం కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో పేర్కొన్నారు.

Share.