సుష్మా స్వరాజ్ ప్రస్థానం

బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. మంగళవారం(ఆగస్టు6, 2019)రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పని చేశారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, ఓ కూతురు ఉన్నారు. ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలాలో జన్మించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1977లో 25 ఏళ్ల పిన్న వయసులోనే హరియాణా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1998 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 3 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.

2004 ఏప్రిల్‌లో సుష్మా స్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ 30 నుంచి 2003 జనవరి 29 వరకు సమాచారశాఖ మంత్రిగా సేవలు అందించారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2009-14లో 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి 2019 మే వరకు మోడీ ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి అంతర్జాతీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు.

మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోడీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. అనారోగ్యం కారణంగానే 2019 ఎన్నికలకు ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ పోటీ చేయని విషయం తెలిసిందే. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీం సీనియర్ న్యాయవాది. స్వరాజ్ కౌశల్ 1990 నుంచి 1993 వరకు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు.

Share.