పవన్ కు షాక్ : జనసేన లాంగ్ మార్చ్ కు నో పర్మిషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు ఎదురుదెబ్బ తగిలింది. లాంగ్ మార్చ్ కు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర జనసేన నేతలు చేస్తున్న ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని స్పష్టం చేశారు.

ఆదివారం(నవంబర్ 3,2019) విశాఖలో జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీలో ఇసుక సంక్షోభంపై లాంగ్ మార్చ్ కు జనసేనాని పవన్ పిలుపునిచ్చి‌న సంగ‌తి తెలిసిందే. లాంగ్ మార్చ్ కోసం ఏర్పాట్లు చేయడానికి వచ్చిన జనసేన నేతలను అధికారులు అడ్డుకున్నారు.

ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నిర్మాణరంగ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించాలని పవన్ నిర్ణయించారు.

భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై నిరసన గళం విప్పిన జనసేనాని లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరసన ప్రదర్శనను చేపట్టేందుకు రెడీ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ లాంగ్ మార్చ్ కు టీడీపీ ఇప్పటికే సపోర్ట్ చేసింది. తమ పార్టీ ముఖ్య నేతలు మార్చ్ లో పాల్గొంటారని చంద్రబాబు ప్రకటించారు.

Share.