పీవీపీ ఇంటిపై దాడి, బెదిరింపులు : నిర్మాత బండ్ల గణేష్ పై పోలీసు కేసు


సినీ నిర్మాత బండ్ల గణేష్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ తనను బెదిరించారని నిర్మాత పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం(అక్టోబర్ 5,2019) అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన బండ్ల గణేష్ హల్చల్ చేశాడని పీవీపీ చెప్పారు.
టెంపర్ సినిమాకు గణేష్‌కు ఫైనాన్స్ గా పీవీపీ రూ.7 కోట్లు ఇచ్చారు. కొంతకాలంగా తన డబ్బు తిరిగివ్వాలని బండ్ల గణేష్‌ను.. పీవీపీ అడుగుతున్నారు. అయినా గణేష్ పట్టించుకోవడం లేదు. దీంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు మరోసారి ఫోన్ చేసి డబ్బులు అడిగారు పీవీపీ. కోపంతో ఊగిపోయిన బండ్ల గణేష్.. రాత్రి తన ఇంటిపై దాడి చేశాడని, అనుచరులతో కలిసి వచ్చి తననను బెదిరించాడని పీవీపీ ఆరోపించారు. జూబ్లిహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బండ్ల గణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదు. 420, 448, 506 రెడ్ విత్, 34 సెక్షన్ల కింద పోలీసులు బండ్ల గణేష్ తో పాటు అతడి అనుచరుల పై కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. తనకు రావాల్సిన బకాయిలు అడినందుకు బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసొచ్చి దౌర్జన్యం చేశారని, బెదిరించారని పీవీపీ వాపోయారు.

టెంపర్ సినిమాకు సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పీవీపీ.. బండ్ల గణేష్ కు రూ.30కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికిగానూ చెక్కులను ఇచ్చారు గణేష్. మిగిలిన డబ్బు చెల్లించాలని బండ్ల గణేష్ ని కొంతకాలంగా పీవీపీ కోరుతున్నారు. దీంతో గణేష్ మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share.