ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై.. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి .. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.
ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై నేడు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది హైకోర్టు. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు ఇవాళ ఉదయం పది గంటలకు విజయవాడలోని రెవెన్యూ భవనంలో సమావేశమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియా ద్వారా ఉద్యోగులకు చేసిన అప్పీల్ పై చర్చించనున్నారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై స్పందించిన ఎన్నికల కమిషన్.. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని సూచిచింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా చర్యలు తీసుకుంటామని.. సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్‌లు సరఫరా చేస్తామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. వ్యాక్సినేషన్లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.