మళ్లీ లోకేష్ భద్రత తగ్గింపు

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు మరోసారి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 8 నెలల్లో లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. Y ప్లస్ కేటగిరీ నుంచి X కేటగిరీకి మార్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం..Z కేటగిరీ నుంచి Y ప్లస్‌కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

భద్రతను కుదించడంపై టీడీపీ..వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్దేశ్యపూర్వకంగానే లోకేష్ భద్రతను తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తోంది. తన భద్రతలో లోపాలను ప్రస్తావిస్తూ..8 సార్లు ప్రభుత్వానికి లోకేశ్ లేఖలు రాశారు.

గతంలో మావోయిస్టుల నుంచి ముప్పు ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో 2014కు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం..2+2 భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం 2014లో అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం వచ్చింది. లోకేష్ భద్రతను 4+4కు పెంచుతూ సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. తర్వాత కొద్ది రోజులకు లోకేష్ భద్రతను Z కేటగిరి చేసింది టీడీపీ ప్రభుత్వం.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవి చూసింది. మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ పరాజయం చవి చూశారు. ఎమ్మెల్సీ అయి..దొడ్డిదారిన మంత్రి అయ్యారని లోకేష్‌పై వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మంత్రి కాలేదని ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే..పోటీ చేసి విజయం సాధించి తీరుతానని అనుకున్న లోకేష్..ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. తాజాగా లోకేష్ భద్రత కుదించడంపై ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి

Share.