అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా : ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం జగన్

ఏపీలో అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామని, ప్రధాని చేతుల మీదుగా రైతు భరోసాని ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. దేశం మొత్తం రైతు భరోసా కార్యక్రమం వైపు చూడాలని అధికారులతో సీఎం జగన్ అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వారికి వివరించారు. రైతు భరోసా పంపిణీ విషయంలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని సీఎం తేల్చి చెప్పారు.

గ్రామ సచివాలయమే కౌలు రైతులకు రైతు భరోసా కార్డులు ఇస్తుందని సీఎం వెల్లడించారు. 11 నెలల కాలానికి ఇది వర్తిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తమకున్న హక్కులకు భంగం వాటిల్లకుండా కేవలం పంటపైన మాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు లభిస్తుందని తెలిపారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు రైతు భరోసాకు అర్హులవుతారని చెప్పారు. ఈ ఒక్కసారికి మాత్రమే రైతు భరోసా రబీకి ఇస్తున్నామని.. 2020 నుంచి మే లో ఇస్తామని సీఎం చెప్పారు. ఆ విధంగా ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామన్నారు.

రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయంగా ఇస్తారు. బ్యాంకులు ఈ సొమ్మును జమ చేసుకునే వీలు లేకుండా నేరుగా రైతుల చేతికే అందిస్తామని సీఎం చెప్పారు. 2020 మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో తెలిపినా.. గత ఐదేళ్లలో రైతుల పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని అంతకంటే ముందే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒకే విడతలో రైతులకు ఇంత మొత్తాన్ని అందించడం దేశ చరిత్రలోనే ఇదో రికార్డుని సీఎం జగన్ అన్నారు.

Share.