రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11వేల 158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి కోసం రూ.199.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

గ్రామ సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభిస్తాయి. ఈ కేంద్రాల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు నియమించారు. ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. పంట వేసింది మొదలు.. మార్కెటింగ్ వరకు.. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను రైతు భరోసా కేంద్రాలు అందిస్తాయి.

వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు 48-72 గంటల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌ పుట్స్‌ను డోర్‌ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. రైతు భరోసా కేంద్రంలో శిక్షణ పొందిన ఉద్యోగితో పాటు, గ్రామ సచివాలయ వ్యవసాయ కార్యదర్శి అందుబాటులో ఉంటారు. రైతులకు సీజనల్‌ వారీగా కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను అందిస్తారు.

ఏప్రిల్‌ నాటికి ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. పాడి, పశుసంవర్థక, ఆక్వా తదితర వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, సమర్ధవంతమైన, సౌకర్యవంతమైన, నాణ్యతతో కూడిన వేదికగా ఈ కేంద్రాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ధృవీకరించిన వ్యవసాయ ఉత్పత్తులు (విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు) ఇక్కడ లభిస్తాయని, ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా అవసరమైన సలహాలను కూడా రైతులు పొందొచ్చని అధికారులు వివరించారు. వివిద బ్రాండ్లకు సంబంధించిన సరుకుల కొనుగోలు కోసం వర్చువల్‌ షాపును నిర్వహించడంతో పాటు, నోడల్‌ ఏజెన్సీగా ఈ కేంద్రాలు పనిచేస్తాయి.

Share.