రవి ప్రకాశ్‌ సంజీవని ఆస్పత్రి విరాళాల గోల్‌మాల్‌ కథ


కూచిపూడిలో కుతంత్రం చేశారు. చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని గద్దల్లా తన్నుకుపోవడానికి ప్రయత్నించారు. అమెరికా స్థాయిలో వైద్యం.. కూచిపూడిలో ఉచితంగా అందిస్తామంటూ గోతులు తవ్వారు. ట్రస్టు మాటున కబ్జాపర్వానికి తెరదీశారు. సిలికానాంధ్ర అక్రమాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. తరచి చూస్తున్న కొద్దీ.. రవి ప్రకాశ్‌ అండ్‌ కో సాగించిన కుతంత్రాలు కొండలా పెరుగుతున్నాయి. సంజీవని ఆస్పత్రి విరాళాల గోల్‌మాల్‌ కథ బయటపడింది.

ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉచిత వైద్యం పేరుతో కూచిపూడిలోకి అడుగుపెట్టిన కూచిబొట్ల ఆనంద్‌, రవిప్రకాశ్‌ టీమ్‌.. అక్రమంగా ఆస్పత్రిని నిర్మించినట్టు తెలుస్తోంది. అప్పటి అధికారులను, ప్రభుత్వాన్ని మేనేజ్‌ చేసి భూమిని కొట్టేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టి అధికారులంతా కలిసి.. ఇప్పుడు సంజీవని ఆస్పత్రి నిర్మించిన స్థలాన్ని అప్పనంగా అందించారని కొందరు ఆరోపిస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకొని భూమి కొట్టేయడం, వైద్యం అందిస్తామంటూ విరాళాలు బొక్కేయడమే కాదు.. కూచిబొట్ల ఆనంద్‌ టీమ్‌ ఊరి చెరువునూ వదిలిపెట్టలేదు.

ట్రస్టు తరపున చెరువును అభివృద్ధి చేస్తామంటూ టూరిజం శాఖ నుంచి మరో మూడు కోట్లు దండుకున్నారు. నిండుకుండలా ఉండే కుంట చెరువును పంచాయతీ అనుమతి లేకుండానే అభివృద్ధి పేరుతో తోడేశారు. టూరిజం శాఖ నుంచే కాకుండా.. స్థానికుల నుంచి కూడా భారీగా విరాళాలు సేకరించి తూతూ మంత్రంగా మెట్లను నిర్మించి కోట్లు మింగేశారు. అంతేకాకుండా నీరు చెట్టు పథకం కింద చెరువులోని మట్టిని కాంట్రాక్టర్లకు అమ్మేసుకున్నారు. అందులోని అందినకాడికి జేబులో వేసుకున్నారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే రౌడీమూకలతో దాడులు చేయించి పోలీసు కేసులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తవ్వుతున్న కొద్దీ కూచిబొట్ల, రవిప్రకాశ్‌లు సాగించిన అక్రమాల దుర్మార్గాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే.. ఇంకెన్నో కుతంత్రాలు వెలుగులోకి వస్తాయంటున్నారు కూచిపూడి వాసులు.

Share.