విదేశీ టూరిస్టుల రాకపై నిషేధం ….సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషేధం విధించింది. రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. విదేశాల నుంచి పర్యాటకులకు రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అక్టోబర్ వరకు ఈ అదేశాలు అమల్లో ఉంటాయి. సిక్కిం కరోనా వైరస్ ఫ్రీ రాష్ట్రం. అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు. అయినా ప్రభుత్వం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇందులో భాగంగా తమ రాష్ట్రంలోకి విదేశీ టూరిస్టులు రావొద్దని చెప్పింది. కరోనా వైరస్ తమ రాష్ట్రంలోకి రాకుండా తీసుకుంటున్న నివారణ చర్యల్లో ఇదీ ఒక భాగం అని ప్రభుత్వం చెప్పింది. ఈ చిన్న పర్వత దేశంలో 7లక్షల మంది జనాభా ఉంటున్నారు.

మన దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ఏకైక దేశం సిక్కిం మాత్రమే. నాగాలాండ్ లో ఒక కరోనా కేసు నమోదైనా ఆ బాధితుడిని అసోం షిఫ్ట్ చేశారు. దీంతో నాగాలాండ్ సైతం కరోనా వైరస్ ఫ్రీ రాష్ట్రమైంది. సిక్కింలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానప్పట్టికి, రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 81మంది నమూనాలు మాత్రమే ల్యాబ్ కి పంపారు. వారందరికి రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది.

సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ, “విదేశీ టూరిస్టులకు రాష్ట్రంలోకి అనుమతి లేదు. అక్టోబర్ వరకు రాష్ట్ర సరిహద్దులు మూసేస్తాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. వలస కార్మికులకు షెల్టర్ ఇచ్చాం. వారికి ఆహారం అందిస్తున్నాం. రోజూ కొంత డబ్బు కూడా ఇస్తున్నాం. లాక్ డౌన్ ఎత్తివేశాక వారి సాయం మాకు అవసరం ఉంటుంది” అని అన్నారు.

సిక్కింకి చెందిన చాలామంది విద్యార్థులు చైనాలో చదువు కుంటున్నారు. వారంతా జనవరిలో సొంత రాష్ట్రానికి తిరిగి వస్తారు. వారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సరిహద్దులు మూసివేయాలని నిర్ణయించాం. విదేశీయులను ఎవరినీ లోనికి అనుమతించము అని గవర్నర్ చెప్పారు. విదేశాల నుంచి సిక్కింకి వచ్చే రాష్ట్ర విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచుతామని గవర్నర్ తెలిపారు. వారికి కరోనా టెస్టులు చేస్తామన్నారు. కరోనా లేదని నిర్ధారణ అయ్యాకే వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు.

Share.