చంద్రబాబు హౌస్ అరెస్ట్… 12 గంటల నిరాహార దీక్ష

గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడి కక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు చర్యల పట్ల చంద్రబాబు తీప్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహాన్ని మార్చిన మాజీ సీసీం చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులను ఎక్కడ అరెస్టుచేస్తే అక్కడే నిరాహార దీక్ష చేపట్టాలని ఆయన ఆదేశించారు.

టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, శిద్దా రాఘవరావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే గోవిందుడును అరెస్ట్ చేసి పున్నమి గెస్ట్‌హౌస్‌కు తరలించారు. ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబును, రాజేంద్ర ప్రసాద్, ఎంపీ కేశినేని నాని, నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ చేశారు.

నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు, సింహాద్రి యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి సమీపంలో దేవినేని అవినాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో దేవినేని అవినాష్, టీడీపీ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఆత్మకూరు నుంచి చంద్రబాబు ప్రచార రధాన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. విజయవాడ నుంచి ఆత్మకూరుకు బయలుదేరిన నారా లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు గుంటూరులో ఎన్టీఆర్ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భవన్ వద్ద పెద్దఎత్తున బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ఆఫీసు సిబ్బందిని కూడా లోనికి వెళ్లనీయడం లేదు. దీంతో పోలీసుల తీరుపై ఎన్టీఆర్ భవన్ సిబ్బంది ఆందోళనకు వ్యక్తం చేశారు.

Share.