చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో?

6
tdp ki shock

చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగనున్న మొదటి ఉప ఎన్నిక కావడంతో తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెరిగింది. జగన్ సర్కారు తీరుపై అలుపెరుగని పోరాటం చేస్తామంటోన్న చంద్రబాబు.. అందరికంటే ముందుగా టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించి పోరును మరిత సరవత్తం చేశారు. కరోనాతో మరణించిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని చెప్పిన వైసీపీ.. తిరుపతి ఎంపీ టికెట్ ను జగన్ ఫిజియో థెరపిస్టు డాక్టర్ గురుమూర్తికి ఇవ్వాలని డిసైడైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకున్నా.. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాత్రం టీడీపీ అభ్యర్థిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి పనబాక షాక్?
అన్ని పార్టీలకంటే ముందుగానే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించడంతో తిరుపతిలో టీడీపీ జెండా ఎగరేస్తామని తెలుగు తమ్ముళ్లు కాన్ఫిడెన్స్‌ ప్రదర్శించారు. కానీ, పనబాక టీడీపీకి షాక్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ టికెట్ దక్కిన తర్వాత పనబాక లక్ష్మిగానీ, ఆమె కుటుంబీకులుగానీ, ఆమె అనుచరులు, కార్యకర్తలెవరూ కనీసం మీడియా ముందుకు రాకపోవడం, ఫోన్లు చేసినా, స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. అంతకు ముందు నుంచే పనబాక బీజేపీలోకి వెళతారనే ప్రచారం సాగగా, కమలనాథులకు చెక్ పెడుతూ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. పనబాక ఎంతకూ మౌనం వీడకపోవడంతో వైసీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యం పనబాక వార్తలను వైరల్ చేస్తున్నాయి..
:: పోటీ నుంచి తప్పుకున్నారా?
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నారని వైసీపీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కొన్ని ఛానెళ్లు, పేపర్లలో వచ్చిన కథనాల ఆధారంగా.. పనబాకకు టీడీపీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని.. అందుకే మౌనంగా ఉన్నారంటున్నారని కొందరు.. పనబాక బీజేపీ తీర్థం పుచ్చుకుని, కమలం గుర్తుపై పోటీకి దిగుతారని ఇంకొందరు అంటున్నారు. జగన్ మీడియాలో ప్రముఖుడైన సీనియర్ జర్నలిస్టు మరో అడుగు ముందుకేసి.. పనబాక వ్యవహారాన్ని ఆదాల ఎపిసోడ్ తో పోల్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా టికెట్ పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి.. గంటల వ్యవధిలోనే వైసీపీలోకి జంప్ అయి, ఫ్యాను గుర్తుతో గెలుపొందిన విషయాన్ని ఆ జర్నలిస్టు గుర్తుచేశారు. తద్వారా టీడీపీలో అభ్యర్థుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈలోపే మరింత సంచనంగా..
::తెలుగుదేశం పార్టీకి ఎంత కష్టం!
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించి వారం రోజులు పూర్తయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం నిజమే. కానీ ఆమె టీడీపీకి షాకిచ్చారని, పోటీ నుంచి తప్పుకున్నారనేది మాత్రం ప్రస్తుతానికి వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రచారం మాత్రమే. ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పనబాక పేరును ప్రస్తావించకుండా.. ‘‘అకటా… 32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చిపడిందా? తిరుపతి బైఎలక్షన్ కు అభ్యర్థి దొరకడం లేదట. టికెటిచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరూ ముందుకు రావడం లేదు” అని తాజాగా ట్వీట్ చేశారు.
:: నాడు నిమ్మగడ్డతో వాయిదా.. ఇప్పుడెలా?
మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి ప్రస్తుత తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అభ్యర్థులు దొరకడంలేదంటూ ఎద్దేవా చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. అంతటితో ఆగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగారు. తిరుపతి ఉప ఎన్నిక లాగే, స్థానిక ఎన్నికల్లోనూ ఇదే(అభ్యర్థులు దొరకని) దరిద్రం టీడీపీకి జిడ్డులా పట్టుకుందని, అప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ సాయంతో చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని, మరి ఇప్పుడెలా? అని సాయిరెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here