ఏం ఎండలు రా బాబు..ఏపీలో మరో నాలుగు రోజులు ఇంతే

ఏం ఎండలు రా..బాబు..అనుకుంటున్నారు జనాలు. సూర్యుడు మే నెల చివరి వారంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రచండమైన వేడిని ప్రసరింప చేస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు ఎండ..మరో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు అపసోపాలు పడిపోతున్నారు. ఈ ఎండలు మరో నాలుగు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.

2020, మే 28వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 42 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. 29వ తేదీ నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.
రాజధాని జిల్లాలైన కృష్ణా – గుంటూరుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం అధికారులు వెల్లడిస్తున్నారు.

రానున్న నాలుగు రోజుల్లో రోహిణీ కార్తె దృష్ట్యా ఎండలు మరింత భగ్గుమంటాయన్నారు. 2020, మే 24వ తేదీ ఆదివారం ఉదయం నుంచే సూర్యుడు తన ఉగ్రరూపం చూపించాడు. గుంటూరులో ఆదివారం గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత జనసంచారం అంతగా కనిపించలేదు.

ప్రస్తుతం వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, రాజస్థాన్ వైపు నుంచి వచ్చే గాలుల ప్రభావంతో…ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వెల్లడిస్తున్నారు. తీవ్రమైన ఉక్కపోత పరిస్థితులు వస్తాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందన్నారు. నీటి శాతం తగ్గకుండా..వీలైనంత ఎక్కువగా నీరు తాగడం, ఉప్పు కలిపిన మజ్జిగ, లస్సీ, ORS ద్రావణం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వృద్ధులు, పిల్లలు ఇంట్లోనే ఉంటే బెటర్ అంటున్నారు. ఉదయం 10 గంటల్లోపు తమ పనులు పూర్తి చేసుకుని ఇంటి పట్టునే ఉండాలంటున్నారు.

Share.