ప్రభుత్వం దగ్గర పైసల్లేవు : ప్రజలు టోల్‌ ట్యాక్స్ కట్టాల్సిందే

టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు అన్న ఆయన.. ప్రజలు టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే అని స్పష్టం చేశారు. టోల్ వ్యవస్థను ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదన్నారు. టోల్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని చెప్పారు. మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు టోల్‌ పన్ను కట్టాల్సిందే అని మంత్రి తేల్చి చెప్పారు. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నంత కాలం టోల్‌ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుందన్నారు.

లోక్‌సభలో మంగళవారం(జూల్ 16,2019) సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు గడ్కరీ ఇలా సమాధానం ఇచ్చారు. టోల్‌ వ్యవస్థ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి గడ్కరీ.. టోల్‌ ద్వారా వసూలు చేసిన నిధుల్ని గ్రామీణ, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో ప్రభుత్వం 40వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించిందని వివరించారు.

”టోల్ వ్యవస్థ బంద్ కాదు. టోల్ ధరలు మారుతూ ఉండొచ్చు. ఒక్కోసారి ఒక్కో ధర ఉంటుంది. టోల్ ట్యాక్స్ నా బ్రైన్ చైల్డ్. మెరుగైన సేవలు కావాలని అనుకుంటే, ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు” అని నితిన్ గడ్కరీ నొక్కి మరీ చెప్పారు. రోడ్డు నిర్మాణాల విషయంలో భూ సేకరణ పెద్ద సమస్యగా మారిందని గడ్కరీ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారాలు కనుగొనాలని చెప్పారు. కనీసం 80శాతం భూ సేకరణ పూర్తి అయితే కానీ ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ చేయడం లేదని గడ్కరీ చెప్పారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో భూసేకరణ చాలా సమస్యగా మారిందన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడానికి ముందు 403 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాటి విలువ రూ.3,85,00 కోట్లు అని చెప్పారు. మోడీ ప్రభుత్వం బ్యాంకులకు రూ.3లక్షల కోట్లు మిగిల్చిందన్నారు. 90శాతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇది మోడీ సర్కార్ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు.

Share.