పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో టీవీ 9 స్టూడియోకు వచ్చిన టైమ్ లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల శనివారం(అక్టోబర్ 5,2019) రవిప్రకాశ్ ని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. టీవీ9 మాజీ సీఎఫ్ వో ఎంకేవీఎన్ మూర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొంత కాలంగా రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. టీవీ9 సంతకాలు ఫోర్జరీ చేశారని, నిధుల గోల్ మాల్ చేశారని ఇప్పటికే కేసులు నమోదు చేశారు. పలుమార్లు రవిప్రకాశ్ ని విచారించారు.

టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో నిధుల గోల్ మాల్ కు పాల్పడ్డారని, టీవీ 9 లోగో అమ్మారని రవిప్రకాశ్ పై కేసులు ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదయ్యాయి.

విచారణలో భాగంగా టీవీ 9లో సోదాలు చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులను అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్ అక్రమాలకు పాల్పడ్డారని టీవీ9 యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలని రవిప్రకాశ్ ని పిలిచారు. అయితే ఆయన రాలేదు. దీంతో వారు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏబీసీఎల్ బ్యాంకు ఖాతాల నుంచి రవిప్రకాశ్ అక్రమంగా రూ.18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారని టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్ తో పాటు టీవీ9 మాజీ సీఎఫ్ వో ఎంకేవిఎన్ మూర్తిపైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రవిప్రకాశ్ పై సంతకాలు ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. డైరెక్టర్లకు చెప్పకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఏబీసీఎల్ కంపెనీకి చెందిన రూ.18కోట్ల నిధులను రవిప్రకాశ్ తన సొంతానికి వాడుకున్నట్టు అలంద మీడియా సెప్టెంబర్ 4న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Share.