చైనాకోరలు పీకేందుకు భారత్ కు అమెరికా సాయం…

కోవిడ్-19 మహమ్మారిపై చైనాను జవాబుదారీని చేసేందుకు టాప్ అమెరికా సెనేటర్ థామ్ టిల్లిస్ 18 పాయింట్ల ప్లాన్ ను ఆవిష్కరించారు. అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం తదితర అభియోగాలపై కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆయన 18 పాయింట్ ప్రణాళికను థామ్ టెల్లిస్ అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. భారత్‌లో సైనిక సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ఆయన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

చైనా నుంచి పరిశ్రమల తరలింపుతో పాటుగా భారత్, వియత్నాం, తైవాన్‌ తదితర దేశాలతో వ్యూహాత్మక సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఈ ప్రణాళికలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. గురువారం తన ప్రణాళికను ఆవిష్కరించే సందర్భంలో థామ్ టెల్లిస్ చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అన్నీ దాచిపెట్టడం వల్ల కరోనా మహమ్మారి ప్రపంచానికి వ్యాపించిందన్నారు.

చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది అమెరికన్లు బలైపోయారన్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం తమ సొంత పౌరులను కార్మిక శిబిరాల్లో నిర్బంధించిందని,అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉద్యోగాలను దోచుకుంటుందన్నారు. అమెరికా మిత్ర దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని సెనేటర్ థామ్ టిల్లిస్ ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని, దేశ భద్రతను కాపాడుకుంటూనే చైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా అమెరికా సహా ప్రపంచ దేశాలు మేల్కొనాలన్నారు. తన కార్యాచరణ ప్రణాళిక చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఉద్దేశించిందని, చైనాను బోనులోకి ఈడ్చుకురావడం ఖాయమని ఆయన తెలిపారు.

చైనాపై ఆంక్షలు విధించాలని థామ్ టెల్లిస్ ప్రతిపాదించారు. పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కట్టడికి చొరవ చేపట్టాలని తెలిపారు. అమెరికా సైన్యం కోరుతున్న 20 బిలియన్ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు) నిధులను మజూరు చేయాలని సెనేటర్ టిలిస్ సూచించారు. ప్రాంతీయ మిత్రదేశాలతో సైనికబంధాన్ని బలోపేతం చేసుకోవాలని, ఇండియా, తైవాన్, వియత్నాంలకు సైనిక ఆయుధాలు సరఫరా చేయాలని తెలిపారు. జపాన్‌ను మళ్లీ సైన్యాన్ని వృద్ధి చేసుకోమని చెప్పాలని కీలక సూచన చేశారు.

చైనా నుంచి అమెరికా కంపెనీలను వెనుకకు పిలిపించుకోవాలని, చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని తెలిపారు. సాంకేతిక ఆధిపత్య సాధించేందుకు అమెరికా కంపెనీలకు రాయితీలు కల్పించాలని చెప్పారు. చైనా హ్యాకింగ్ లకు వ్యతిరేకంగా సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని అన్నారు. చైనా టెక్నాలజీ కంపెనీ హువావెయ్‌ పై నిషేధాన్ని అమలు చేయాలని, మిత్రదేశాలతో అలాంటి నిషేధాలు అమలు చేయించాలని చెప్పారు. వైరస్ గురించి అబద్ధాలు చెప్పినందుకు చైనా నుంచి పరిహారం రాబట్టాలని, ఆంక్షలు విధించాలని చెప్పారు.

Share.