చర్చలు విఫలం : టీడీపీలో కొనసాగలేనని స్పష్టం చేసిన వంశీ


గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించలేదు. వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీడీపీలో తనకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చిన వంశీ… పార్టీలో కొనసాగలేనని క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు తరపున వారు అనేక హామీలు ఇచ్చినా వంశీ మెత్తబడలేదు. తాను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానని.. దాని నుంచి వెనకడుగు వేసే ప్రసక్తేలేదని టీడీపీ రాయబారులకు తేల్చిచెప్పేశారు. అంతేకాదు… తాను వైసీపీలో చేరబోతున్నానని కూడా వారికి చెప్పేశారు.

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దించిన కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. అర్ధరాత్రి వరకు దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన వీరి చర్చలు కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా… తనపైనా, తన అనుచరులపైనా నమోదువుతున్న అక్రమ కేసుల విషయాన్ని వంశీ… వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే… టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నాని, నారాయణ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉన్న ఇబ్బందుల విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా… వంశీ మాత్రం ససేమిరా అన్నారు.

దీంతో వారంరోజులుగా దోబూచులాడుతున్న వల్లభనేని వంశీ ఎపిసోడ్‌కు ఓ క్లారిటీకి వచ్చినట్లయింది. మొదట బీజేపీ నేతలను, ఆ తర్వాత వైసీపీ అధినేతను కలిసిన వంశీ… ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అదే సమమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. దీంతో వంశీ రూటెటు అన్నది ఆసక్తి రేపింది. ఆ తర్వాత వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు. రెండు రోజుల పాటు తానెక్కడున్నది ఎవరికీ తెలియకుండా గడిపారు. ఇదంతా కొనసాగుతుండగానే.. వంశీను బుజ్జగించేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఎట్టకేలకు ఆయనతో చర్చలు జరిపింది. కానీ… ఆ చర్చలు టీడీపీకి అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

వల్లభనేని వంశీ నెక్స్ట్ స్టెప్ ఏంటోనన్న ప్రశ్నలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వంశీ… వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 3న ఆయన… వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. తన లక్కీ నంబర్‌ త్రీ కావడంతో ఆ రోజునే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share.