లేడీ సూపర్ స్టార్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి.. భారతీయ జనతా పార్టీలో చేరడం ఇప్పటికే ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే విజయశాంతి.. బీజేపీ కండువా కప్పుకుంటారని తెలిపారు. అయితే, ఎప్పుడు చేరేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.. కానీ, బీజేపీ గూటికి రాములమ్మ చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది.
మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు విజయశాంతి.. ఈ టూర్లో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలుస్తారని ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయన సక్షమంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని చర్చ సాగుతోంది. కాగా, కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు విజయశాంతి… టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె.. తాజాగా జరిగిన దుబ్బాక ఎన్నికల ప్రచారంలో గానీ, ప్రస్తుతం జరుగుతోన్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో గానీ.. పాల్గొనడం లేదు. కానీ, ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.. మరోవైపు.. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా ఆమెను కలిసి చర్చలు జరిపారు.. బీజేపీలో చేరేలా ఆమెను ఒప్పించినట్టు.. ఈ ఢిల్లీ పర్యటనలోనే విజయశాంతి… బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో రాములమ్మ పార్టీలో చేరితే.. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే బీజేపీ తరపున గ్రేటర్లో రాములమ్మప్రచారం కూడా చేస్తారనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.