బాలకృష్ణ సినిమా కాదు : మనిషిని చంపేసిన కోడి పుంజు

టైటిల్ చూసి షాక్ అయ్యారా. కోడి మనిషిని చంపడం ఏంటని నమ్మలేకపోతున్నారా. కానీ ఇది నిజం. కోడి పుంజు.. మనిషిని చంపే సీన్లు కొన్ని తెలుగు సినిమాల్లో చూసుంటారు. మరీ ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో. పల్నాటి బ్రహ్మనాయుడు మూవీలో హీరో బాలయ్యకి చెందిన చిన్నమల్లు అనే కోడి పుంజు విలన్ ని తన కాలి గోళ్లతో రక్కి రక్కి చంపిన సీన్ గుర్తుంది కదా. అలాంటి సీన్ రియల్ లైఫ్ లోనూ జరిగింది.

ఇక్కడ మాత్రం తన ముక్కుతోనే ఆ కోడి పుంజు చంపేసింది. పెంపుడు కోడి ఓ వృద్ధ మహిళ(76) ప్రాణాలను బలిగొన్న ఘటన సౌత్ ఆస్ట్రేలియాలో జరిగింది. గుడ్లు తీస్తున్న సమయంలో ఆమెపై కోడి పుంజు దాడి చేసింది. అప్పటికే కోపంతో ఉన్న పుంజు.. తన పదునైన ముక్కుతో ఆమె ఎడమ కాలిపై అటాక్ చేసింది. పలు చోట్ల గాయాలు కావడం.. చాలాసేపటి వరకు రక్తస్రావం కావడంతో ఆ వృద్దురాలు మరణించింది. వృద్ధురాలి ఎడమ కాలిపై కోడి పుంజు తన ముక్కుతో దాడి చేసింది. వృద్ధురాలి రక్తనాళాలపై తీవ్ర గాయం కావడమే చనిపోవడానికి కారణం అని అటాప్సీ రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. కోడి పుంజు మనిషిని చంపిన ఘటన స్థానికంగా సంచలనమైంది. విషయం తెలుసుకున్న బంధువులు, చుట్టుపక్కల వారే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఓ పుంజు మనిషిని చంపడం ఏంటని విస్తుపోయారు.

పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియన్‌ వాసులను ఈ కేసుని అధ్యయనం చేసిన ఫోరెన్సిక్‌ నిపుణుడు రోజర్‌ బైర్డ్‌ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసైనా వయసు పైబడినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వయసు పైబడిన వారి చర్మం చాలా సున్నితంగా, పల్చగా ఉంటుందన్నారు. అందుకే కోడి దగ్గరకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పుంజుని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాన్ని పోలీసులు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు.. కోర్టులో దాన్ని హాజరుపరిస్తే జడ్జి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Share.