10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు ‘ ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తారు. కంటి వెలుగు పథకాన్ని 5 దశల్లో అమలు చేస్తారు. పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్‌గా టాన్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

పథకాన్ని తొలి రెండు దశల్లో స్కూల్‌ విద్యార్థులకు అమలు చేస్తారు. తర్వాత మూడు, నాలుగు, ఐదు దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ ఆపరేషన్, ఇతరత్రా అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు. కంటి వెలుగుకు సంబంధించిన సామగ్రి, పరికరాలు, మందుల్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కంటి వెలుగు పరీక్షల నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.

ఈ పథకం కోసం రూ.560 కోట్లు కేటాయించారు. 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందించనుననారు. ఈ పథకం విజయవంతం కావడానికి డాక్టర్లు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరారు. అక్టోబరు 10 నుంచి 16వ తేదీ వరకు కంటి పరీక్షలు జరుగుతాయి. కంటిచూపు లోపం గుర్తించిన వారందరికీ ఆధునిక వైద్య పరీక్షలు, అవసరమైన శస్త్ర చికిత్సలు, మందులు, కళ్లజోళ్ళు ఉచితంగా అందజేస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘కంటివెలుగు’ పథకాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు ఏపీలోనూ ప్రవేశపెట్టారు.

Share.