జెడ్పీటీసీ ఎన్నికలపై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..

17

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించిందా? ఎన్నికలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యిందా? ఎస్ఈసీపై నమ్మకం లేదా? చంద్రబాబు తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూసిన టీడీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎస్ఈసీపై నమ్మకం లేదు:
గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎస్‌ఈసీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకుందని.. పోటీలో నిలిచిన ప్రత్యర్థులను విత్ డ్రా చేసుకునేలా వైసీపీ నేతలు బెదిరించారని ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్ని ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవని.. అందుకే ఎన్నికలను బహిష్కరించినట్లు టీడీపీ వర్గాల టాక్‌గా వినిపిస్తోంది.
పొలిట్ బ్యూరో భేటీ తర్వాత నిర్ణయం:
పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ పై చర్చించనున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించే అంశంపై పొలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత ఎన్నికలపై టీడీపీ తమ విధానం తెలుపనుంది. అలాగే పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాన్ని సైతం టీడీపీ బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మర్యాద కాపాడుకోవడానికే ఎన్నికల బహిష్కరణ:
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ ఆలోచనపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రజలు ఎలాగూ తమకు ఓటేయరని చంద్రబాబుకి తెలిసిపోయిందని.. మర్యాద కాపాడుకోవడం కోసమే ఎన్నికలు బహుష్కరించే ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీని ఇప్పటికే ప్రజలు బహిష్కరించారని మంత్రి చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని ఆటలు ఆడారు, ఇప్పుడు మంచి ఎస్ఈసీ వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారు అని మంత్రి మండిపడ్డారు.
ఎస్ఈసీ నీలం సాహ్ని దూకుడు:
కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. ఏప్రిల్ 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 10న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ తీర్పు రాక ముందే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. కాగా, ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయి.
గురువారం(ఏప్రిల్ 1,2021) జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండడంతో తీర్పు వచ్చాక నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే అధికారులతో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్‌ఈసీ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేశారు.
పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 33వేల 663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2కోట్ల 82లక్షల 15వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతేడాది 660 జెడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 126 జెడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 526 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల మొత్తం 2వేల 92మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 10వేల 42 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. విభజన, కోర్టు కేసులు కారణంగా 354 ఎంపీటీసీ లకు ఎన్నికలు నిలిచాయి. 2వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 7వేల 322 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల బరిలో మొత్తం 12వేలమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here